ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా ఉన్న యూపీలో జనాభాను నియంత్రించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రతీ కుటుంబంలో ఇద్దరు కంటే ఎక్కువ సంతానం కలిగి ఉండవద్దని నిబంధన తీసుకురానున్నారు. ఈ మేరకు ముసాయిదా బిల్లును కూడా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయించింది. అయితే ఈ నిర్ణయంపై దేశ వ్యాప్తంగా పెనుదూమారమే లేచింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జనాభా పెరుగుదలపై సీఎం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం శోచనీయమంటున్నాయి.
యూపీలో జనాభా పెరుగుదల వల్ల పేదరికం ఏర్పడుతుంది. దీంతో అభివృద్ధి జరగడం లేదని సీఎం అభిప్రాయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో సంతానం తగ్గించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించారు. జనాభాను తగ్గించడానికి ఆయన కొన్ని మార్గదర్శకాలు తయారు చేశారు. వాటిని పాటించకపోతే ప్రభుత్వ పథకాలతో పాటు, రాజకీయాల్లో అవకాశం కోల్పోతారని హెచ్చరించారు. యూపీలో ప్రస్తుతం 2.7 శాతం జనరేటు ఉంది. దానిని 1.7కు తగ్గించాలని అధికారులను ఆదేశించారు.
జనాభా నియంత్రణ కోసం 2018 నుంచి యూపీ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా బిల్లును రెడీ చేసింది. ఈ బిల్లు ప్రకారం ప్రతీ కుటుంబంలో ఇద్దరు సంతానం కలిగి ఉండాలి. ఆ ఇద్దరి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండాలి. ఇక ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అవకాశం ఉండదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావు. ఇప్పుడున్న వారిలోనూ ముగ్గురు సంతానం ఉంటే వారికి పదోన్నతులు కష్టమే. అయితే ఇద్దరు సంతానం ఉన్నవారికి మాత్రం ప్రోత్సాహకాలు అందుతాయని సీఎం వివరించారు.
యూపీలో మొత్తం 24 కోట్ల జనాభా ఉంది. దీనిని తగ్గించడానికి యోగి సర్కారు ఇలాంటి కఠిన నిబంధనలు పెట్టనుంది. ఈ మేరకు ముసాయిదా యూపీ జనాభా బిల్లు -2021 ను తయారు చేసింది. ఇది చట్ట రూపంలో వస్తే యోగి నిర్ణయం అమలైనట్లే. అయితే సీఎం తీసుకున్న నిర్ణయాన్ని మైనార్టీలు, ఎస్పీ, బీఎస్పీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే వారిలోనే జనాభా రేటు ఎక్కువ. ఈ బిల్లుతో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారంటున్నారు. అంతేకాకుండా ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా కూడా చర్చ సాగుతోంది.