YSR Death Anniversary
YSR Death Anniversary: తెలుగు ప్రజల గుండెచప్పుడు, అపర భగీరధుడు, సంక్షేమానికి ఆధ్యుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి. సుదీర్ఘకాలం అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీకి ఆశా దీపంగా నిలిచారాయన. సుదీర్ఘకాలం పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. సంక్షేమ పథకాలతో ప్రజల మనసును గెలుచుకున్నారు. అదే సమయంలో అభివృద్ధికి పెద్ద పీట వేసి మౌలిక వసతులను కల్పించగలిగారు. అందుకే ఆ మహానీయుడు భౌతికంగా దూరమై పుష్కరకాలం దాటుతున్నా.. ఇంకా ప్రజల మదిలో చిరస్మరణీయుడిగా నిలిచి ఉన్నారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ఓకే తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం.
రాజశేఖర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం పూల పాన్పు కాదు. తనకంటూ ఒక ఇమేజ్ తో.. అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక రాజకీయ రాజ్యానికి రారాజుగా ఎదిగారు. జయమ్మ, రాజారెడ్డి దంపతులకు 1949 జూలై 8న రాజశేఖర్ రెడ్డి జన్మించారు. ఆయన ప్రాథమిక విద్య బళ్లారిలోని సెయింట్ జాన్స్ లో సాగింది. అటు తరువాత విజయవాడ లయోలా కాలేజీలో కళాశాల విద్య పూర్తి చేశారు. 1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి వైద్య విద్యలో పట్టా తీసుకున్నారు. ఆ సమయంలోనే విద్యార్థి సంఘ నాయకుడిగా ఎదిగారు.
కడప జిల్లాను శాసించిన చరిత్ర రాజశేఖర్ రెడ్డిది. కడప లోక్సభ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు రాజశేఖర్ రెడ్డి గెలుపొందారు. రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నేతగా, పిసిసి అధ్యక్షుడిగా రెండుసార్లు పనిచేశారు. 1980లో తొలిసారిగా మంత్రి పదవి చేపట్టారు. 1985 నుంచి కాంగ్రెస్ రాజకీయాల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు. కానీ అడుగడుగునా అప్పటి ముఖ్యమంత్రుల చేతిలో అణచివేతకు గురయ్యారు. ఆ సమయంలోనే రాజకీయంగా రాటు తేలారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాలని చాలాసార్లు ప్రయత్నించారు. కానీ ఢిల్లీ రాజకీయాలు మూలంగా పదవి వచ్చినట్టే వచ్చి చేజారిపోయేది. మర్రి చెన్నారెడ్డి,నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వంటి నేతలతో హోరాహోరీగా తలపడ్డారు.
1994 తర్వాత కాంగ్రెస్ పార్టీ గడ్డు రోజులను ఎదుర్కొంది. అటు జాతీయస్థాయిలో, ఇటు ఉమ్మడి ఏపీలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది. 1994, 99 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రికార్డ్ స్థాయి విజయం సాధించింది. వరుసగా రెండుసార్లు ఓటమి చవి చూడడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నైరాస్యంలోకి వెళ్లిపోయాయి. పార్టీలో నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి. అటు జాతీయ స్థాయిలో సైతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారింది. ఈ తరుణంలోనే డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో సుదీర్ఘ పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. 2004 ఎన్నికల ముందు ఉమ్మడి ఏపీలో ప్రతి జిల్లాలో పాదయాత్ర చేశారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకం అయ్యారు. దాని ఫలితంగానే ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. 42 ఎంపీ స్థానాలు గాను 30కు పైగా కైవసం చేసుకుంది. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోనే యూపీఏ అధికారంలోకి రావడానికి ఏపీ దోహద పడింది.
రాజశేఖర్ రెడ్డి కృషిని గుర్తించిన కాంగ్రెస్ హై కమాండ్ ఆయనకే ఏపీ ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పగించింది. ఎంతోమంది నాయకులు ఆశావహులుగా ఉన్నా..వారందరినీ కాదని ఏపీ బాధ్యతలను కట్టబెట్టింది. 2004-09 మధ్య ఏపీ సీఎం గా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి తెలుగు ప్రజల జీవితాలపై జరగని ముద్ర వేశారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉచిత విద్యుత్ అందించే ఫైలు పైనే తొలి సంతకం చేశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, 108 అంబులెన్స్ సేవలు లాంటి ప్రజలకు అవసరమైన పథకాలను ప్రవేశపెట్టారు. ప్రజల అభిమానాన్ని చురగొన్నారు. అందుకే ప్రజల సైతం 2009లో రెండోసారి రాజశేఖర్ రెడ్డి కి అధికారం కట్టబెట్టారు. 2010 సెప్టెంబర్ 2న రచ్చబండ కార్యక్రమం కోసం బయలుదేరిన రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. మహానేతగా మిగిలారు. తెలుగు ప్రజలకు విషాదాన్ని మిగిల్చారు. ఆ మహనీయుడుని మరోసారి స్మరించుకుందాం.