Modi Cabinet 2024: మరికొద్ది క్షణాల్లో భారతదేశానికి మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు నరేంద్ర మోదీ సిద్ధమవుతున్నారు.. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగానే మెజారిటీ సాధించిన భారతీయ జనతా పార్టీ.. ఈసారి ఆ మ్యాజిక్ కొనసాగించలేకపోయింది. మెజారిటీకి కొన్ని సీట్ల దూరంలో నిలిచిపోయింది. ఈ క్రమంలో భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇటీవల భాగస్వామ్య పార్టీల అధినేతలతో నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. మంత్రివర్గ కూర్పును అక్కడే దాదాపుగా పూర్తి చేశారు. అయితే కీలక శాఖలైన హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలను బిజెపి తన వద్ద అట్టిపెట్టుకుని ఉంది. మిగతా శాఖలను భాగస్వామ్య పార్టీలకు కేటాయించింది.
మూడోసారి కొలువు తీర బోయే మోదీ ప్రభుత్వంలో రాజ్ నాథ్ సింగ్ మంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. ఆయనకు ఈసారి కూడా రక్షణ మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది.. ఈయనతో పాటు అమిత్ షా, నితిన్ గడ్కరి, జై శంకర్, నిర్మల సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, హర్దీప్ సింగ్ పూరి, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, అశ్వనీ వైష్ణవ్, మన్ సుఖ్ మాండవియా, సీఆర్ పాటిల్, కిరణ్ రిజిజు కు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని తెలుస్తోంది. వీరు మాత్రమే కాకుండా శివరాజ్ సింగ్, జేపీ నడ్డా ను కూడా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. నడ్డా ప్రస్తుతం బిజెపి జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పార్టీ కార్యకలాపాలను వేరే నాయకుడికి అప్పగించి, ఆ స్థానం నుంచి నడ్డాను రిలీవ్ చేస్తారని తెలుస్తోంది. వీరు మాత్రమే కాకుండా అర్జున్ మేఘవాల్, మనోహర్ లాల్ ఖట్టర్, రావు ఇంద్రజిత్ సింగ్, భూపేంద్ర యాదవ్, ఎల్ మురుగన్, ప్రహ్లాద జోషి, శోభ కర్లాంద్లజే, నిము బెన్ బంబానీయా, జువల్ ఒరం, సోమన్న, కమలాజిత్ సెహర్వాకాత్ వంటి నాయకులకు అవకాశం దక్కుతుందని తెలుస్తోంది. అయితే ఈసారి అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాలాకు చోటు లభించడం అనుమానమేనని ప్రచారం జరుగుతోంది.
బిజెపికి భాగస్వామ్య పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో.. ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా ఐదుగురికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. టిడిపి నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బిజెపి నుంచి శ్రీనివాస వర్మ కు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కిందని తెలుస్తోంది. తెలంగాణ భారతీయ జనతా పార్టీ నుంచి గెలుపొందిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి వారిని ఈసారి కేంద్రమంత్రి వర్గంలో తీసుకుంటున్నామని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వారికి ఆహ్వానం అందింది.. కూటమి పార్టీల నుంచి కుమారస్వామి (జెడిఎస్), చిరాగ్ పాశ్వాన్, రామ్ నాథ్ ఠాకూర్, జితన్ రాం మాంఝీ, జయంత్ చౌధరి(ఆర్ఎల్డీ), అనుప్రియ పటేల్, ప్రతాప్ రావు జాదవ్ (శివసేన- షిండే), లలన్ సింగ్, రామ్ దాస్ అథవలె (రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా) వంటి వారి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.