https://oktelugu.com/

Minister Malla Reddy : ఏపీని కెలికిన మంత్రి మల్లన్న..మరో దుమారం తప్పదా?

మంత్రులను సీఎం జగన్ కట్టడి చేయాలని సూచించారు. లేకపోతే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతమైతే తీవ్ర పరిణామాలుంటాయని స్పష్టం చేశారు

Written By:
  • Dharma
  • , Updated On : April 28, 2023 11:37 am
    Follow us on

    Minister Malla Reddy : రాజుగారి మొదటి భార్య బాగుందంటే.. రెండో భార్య బాగాలేదనే కదా అర్థం. ఇప్పుడు తెలంగాణ మంత్రుల మాటలు కూడా అలానే ఉన్నాయి. తెలంగాణలో అద్భుత పాలన సాగుతోందంటూ.. పరోక్షంగా ఏపీలో అస్సలు బాగాలేదన్న అర్ధం వచ్చేలా మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న మంత్రి హరీష్ రావు కామెంట్స్ తో ఏకంగా ఉభయ తెలుగు రాష్ట్రాల మంత్రులు కలబడ్డారు. ఆ వివాదం సద్దుమణగక ముందే తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేసిన హాట్ కామెంట్స్ మరోసారి దుమారం రేపుతున్నాయి. పాలు అమ్మినా.. పూలు అమ్మినా అంటూ గొప్ప ప్రాచుర్యం పొందిన మల్లారెడ్డి ఏపీ పాలనకు, కేసీఆర్ పాలనకు చాలా తేడా ఉందన్నారు. తెలంగాణలో కేసీఆర్ అద్భుత పాలన అందిస్తున్నారని గుర్తుచేశారు. దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పిమరోసారి ఏపీని కెలికారు.

    హరీష్ వ్యాఖ్యలతో కాక..
    మొన్నటికి మొన్న హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణలో ఉపాధి పొందుతున్నవారంతా ఇక్కడే ఉండిపోతామని చెబుతున్నారని.. అటువంటి వారంతా ఇక్కడే ఆధార్ కార్డులు తీసుకోండి సుపరిపాలన, సంక్షేమం అందిస్తామని ఏపీ వలసకూలీలకు హామీ ఇచ్చారు. ఏపీని తక్కువ చేస్తూ అర్ధమొచ్చేలా మాట్లాడారు. దీంతో ఏపీ మంత్రులు రియాక్టయ్యారు. మంత్రి అప్పలరాజు ఒక అడుగు ముందుకేసి కేసీఆర్ కుటుంబంపైనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను అవినీతిపరులుగా, చివరకు తాగుబోతులుగా కూడా అభివర్ణించారు. తెలంగాణ ప్రజలకు బుర్రలేనందు వల్లే అటువంటి నాయకులను ఎన్నుకున్నారని మంత్రి అప్పలరాజు చేసిన కామెంట్స్ ఉభయ రాష్ట్రాల్లో సెగలు రేపాయి. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం మంత్రి అప్పలరాజుకు వివరణ కోరినట్టు వార్తలు వచ్చాయి.

    పవన్ రియాక్షన్ తో..
    అయితే ఈ ఎపిసోడ్ పై జనసేన అధ్యక్షుడు స్పందించారు. రాజకీయ విమర్శలు చేసుకుంటే మీరూ మీరూ చేసుకోండి మధ్యలో తెలంగాణ ప్రజలను ఎందుకు తక్కువ చేసి మాట్లాడరని ప్రశ్నించారు. మంత్రులను సీఎం జగన్ కట్టడి చేయాలని సూచించారు. లేకపోతే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతమైతే తీవ్ర పరిణామాలుంటాయని స్పష్టం చేశారు. దీనిపై వైసీపీ మంత్రులు, నాయకులు రియాక్టయ్యారు. ఏపీ మంత్రులను తక్కువ చేసి తెలంగాణ వారికి సపోర్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ తో కొత్త బంధం కోరుకుంటున్నారని ఆరోపణలు చేశారు. అయితే దీనిపై పవన్ ఎటువంటి రిప్లయ్ ఇవ్వలేదు. అంతా సద్దుమణిగిందన్న తరుణంలో ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

    వాస్తవాలు మరుగున..
    ఒకసారి వాస్తవాలు పరిశీలిస్తే.. పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో రహదారులు బాగాలేదు. ఇలా రాష్ట్రంలో ఎంటరైన వారికి ఇవేం రహదారులు అన్నంతగా విసుగుపుట్టిస్తున్నాయి. పక్కా రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు ఏపీతో సన్నిహిత సంబంధాలున్నాయి. అటువంటి వారు ఏదో పనిమీద వచ్చినప్పుడు రహదారులు చుక్కలు చూపిస్తున్నాయి. నిమిషాల ప్రయాణానికి గంటల వ్యవధి అవుతుండడంతో వారిలో అసహనం పెరుగుతోంది. తమది సంక్షేమ పాలన అని చెప్పకున్న జగన్ సర్కారు.. వారికి విఫల ప్రభుత్వంగా కనిపిస్తోంది. అందుకే వారు వైసీపీ సర్కారుపై ఉన్న అభిప్రాయాన్ని బహటంగానే వ్యక్తం చేస్తున్నారు. అది రాజకీయ దుమారానికి కారణమవుతోంది. ఇప్పుడు ఏపీ, తెలంగాణ మధ్య జరుగుతోంది అదే. కానీ అంశం పక్కదారి పడుతోంది. ప్రజల భావోద్వేగాలను అడ్డంపెట్టుకొని డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తోంది.