https://oktelugu.com/

AP CM Jagan : జగన్ కు చెప్పుకునే దిక్కేదీ?

వాస్తవానికి జగనన్నకు చెప్పుకుందాం కాల్ సెంటర్ కు ఫోన్ వస్తే చాలూ..సమస్యలు పరిష్కారమయ్యాయని పెద్ద ఎత్తున పబ్లిసిటీకీ కూడా ఐ ప్యాక్ ప్లాన్ చేసింది.

Written By:
  • Dharma
  • , Updated On : April 28, 2023 / 11:24 AM IST
    Follow us on

    AP CM Jagan : ఏపీ సీఎం జగన్ ది విచిత్ర పరిస్థితి. గత ఎన్నికల్లో అంతులేని ప్రజాభిమానంతో కనీవినీ ఎరుగని విజయాన్ని దక్కించుకున్నారు. ఇప్పుడదే ప్రజలను కలిసేందుకు ఇష్టపడడం లేదు. అయితే ఆయనలో ఏదో భయం వెంటాడుతోంది. అందుకే పరదాల మాటున, పోలీసుల బలగాల నడుమన పర్యాటనలు చేస్తున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు చూపిన తెగువ అస్సలు కనిపించడం లేదు. నాటి హామీలు ఏమయ్యాయని అడుగుతారనో.. వారి అంచనాలకు తగ్గట్టు పాలన అందించలేకపోయాననో ఆత్మనూన్యతా భావమో తెలియదు కానీ.. ప్రజలను కలిసేందుకు అస్సలు ఇష్టపడడం లేదు. నేను సంక్షేమ పథకాల బటన్ నొక్కుతున్నాను.. మీరు ప్రజలకు ఈ విషయం చెప్పండంటూ తన వారధులైన ఎమ్మెల్యేలు, మంత్రులకు పురమాయిస్తున్నారు. తనకు ఎదురయ్యే నిలదీతలు వారిపై నెడుతుండడంతో.. వారు బెంబేలెత్తిపోతున్నారు. సీఎం అసలు ప్లాన్ తెలుసుకుంటున్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఓకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.

    నాడు ఎంతో ముచ్చటగా..
    దేవుడి దయతో.. ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చాం.. ప్రజలకు జవాబుదారిగా ఉంటూ పాలన సాగిస్తామంటూ తొలినాళ్లలో జగన్ ప్రకటించారు. అప్పటివరకూ చంద్రబాబు సర్కారు నిర్వహిస్తున్నవినతుల విభాగం గ్రీవెన్స్ సెల్ ను ‘స్పందన’గా మార్చేశారు. రాష్ట్రస్థాయిలో ప్రజాదర్బారు నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కార మార్గం చూపిస్తామని చెప్పుకొచ్చారు. అదిగో ఇదిగో ప్రారంభ తేదీలంటూ లీకులిచ్చారు. సాక్షిలో పతాక శీర్షికన కథనాలు వండి వార్చారు. అయితే కాలగర్భంలో ప్రజాదర్భారు కార్యరూపం దాల్చకుండానే కనుమరుగైంది. ఇప్పుడు కొత్తగా కాల్ సెంటర్ పెడతామని చెబుతున్నారు. దీనికి ముహూర్తాలు నిర్ణయించి మరీ దాటవేస్తున్నారు. తొలుత ఏప్రిల్ 13 అన్నారు. ఇప్పుడు కొత్తగా 30 అని చెబుతున్నారు. కానీ ఇదైనా చేస్తారో లేదో అన్నది క్లారిటీ ఇవ్వడం లేదు.

    ఐ ప్యాక్ ప్లాన్..
    అయితే ఈ కొత్తగా కాల్ సెంటర్ పేరును జగనన్నకు చెప్పుకుందాం అని నిర్ణయించారు. కలర్, కాన్సెప్ట్ అంతా మమతాబెనర్జీ సర్కారును కాపీ కొట్టారు. దీని వెనుక ప్లాన్ చేసింది ఐ ప్యాక్ టీమ్. మొన్నటి ఎన్నికల ముందు నుంచే పశ్చిమబెంగాల్ తృణముల్ కాంగ్రెస్ కు ప్రశాంత్ కిశోర్ టీమ్ పనిచేసింది. ఇప్పుడదే టీమ్ జగన్ కు వర్క్ చేస్తోంది. అందుకే బెంగాల్ లో వర్కవుట్ అయిన ‘దీదీకా బోలో’ కార్యక్రమం రీమేక్ గా జగనన్నకు చెప్పుకుందాం కార్యక్రమాన్ని ఐ ప్యాక్ టీమ్ ప్లాన్ చేసింది. అయితే బెంగాల్ లో మాదిరిగా వర్కవుట్ అవుతుందా? లేదా? అన్నది అనుమానం ఉంది. పాదయాత్ర సమయంలో దారిపొడవునా జగన్ ఎన్నో హామీలిచ్చారు. వాటిని సైడ్ చేస్తూ కేవలం నవరత్నాలే ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తాయని జగన్ భావిస్తున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటినీ తన మైండ్ నుంచి డిలీట్ చేశారు. ఇప్పుడు కాల్ సెంటర్ ఏర్పాటుచేస్తే ఇలా ఇచ్చిన హామీలను అమలుచేయాలని బాధిత వర్గాలు కోరే అవకాశముంది. అందుకే జగనన్నకు చెప్పుకుందాం కాల్ సెంటర్ పై అచీతూచీ అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది.

    విఫల ప్రయోగంగా భావించి..
    ఇటీవల ఏపీలో ఐ ప్యాక్ టీమ్ వ్యూహాలేవీ ఫలించడం లేదు. ఇది కూడా ఒక విఫల ప్రయోగంగా మిగిలిపోతుందన్న భయం జగన్ ను వెంటాడుతోంది. వాస్తవానికి జగనన్నకు చెప్పుకుందాం కాల్ సెంటర్ కు ఫోన్ వస్తే చాలూ..సమస్యలు పరిష్కారమయ్యాయని పెద్ద ఎత్తున పబ్లిసిటీకీ కూడా ఐ ప్యాక్ ప్లాన్ చేసింది. కానీ కవర్ చేసుకోలేనంత ఆగ్రహం ఉందని.. కాల్ సెంటర్ కు .. వచ్చే కాల్స్ మొత్తం వైసీపీ నేతల దురాగతాలు… జగన్ చేతకాని తనానికి పరాకాష్టగా నిలిచే ఉదంతాల గురించే ఉంటాయన్న భయంతో ఆపేసినట్లుగా చెబుతున్నారు. మళ్లీ పెడతారో లేదో కానీ సమస్యలు వినడానికి జగన్ భయపడుతున్నారని స్పష్టమవుతోంది. ఏ ప్రజల అభిమానంతో అధికారాన్ని కైవసం చేసుకున్నారో.. అదే ప్రజలను భయపడుతుండడం విచిత్రంగా ఉంది కదూ.. అయితే ముమ్మాటికీ జగన్ స్వయం కృతపమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.