Minister KTR- BRS: తెలంగాణ రాష్ట్ర సమితి కాలగర్భంలో కలిసిపోయింది. భారత రాష్ట్ర సమితి పురుడు పోసుకుంది. నమస్తే తెలంగాణ పరిభాషలో చెప్పాలంటే ఇప్పుడు కెసిఆర్ ఢిల్లీలో చక్రాలు తిప్పుతారు. త్వరలో ప్రధానమంత్రి అవుతారు.. దేశానికి ఒక గుణాత్మకమైన మార్పు చూపిస్తారు.. సరే ఇదంతా ఒక అబ్జర్డ్.. పొలిటికల్ గ్యాంబ్లింగ్ అని అంటారా.. ఎవరి వెర్షన్ వారిది. భారత రాష్ట్ర సమితి కార్యాలయం ఈరోజు ఢిల్లీలో ప్రారంభం కాబోతోంది. ఉదయం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అక్కడే రాజ్యశ్యామల యాగం, చండీయాగం నిర్వహించనున్నారు. ఈ క్రతువులో పాల్గొనేందుకు తెలంగాణ ప్రాంతం నుంచి బీఆర్ఎస్ నాయకులు అందరూ తరలి వెళ్లారు. కానీ ఒక్కరు తప్ప.

కవిత హడావిడి
భారత రాష్ట్ర సమితి జాతీయ కార్యాలయ ప్రారంభానికి కొద్దిరోజుల ముందే రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, ఆర్ అండ్ బీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. అక్కడ పనులు పరిశీలించారు.. ఎమ్మెల్సీ కవిత కూడా ఢిల్లీ వెళ్లారు. సీఎం కేసీఆర్ అయితే మనవడు హిమాన్షును వెంటబెట్టుకొని ఢిల్లీ వెళ్లారు.. అక్కడ ఆయన సందడి చేస్తున్నారు. రాజకీయ నాయకుడి మాదిరి అభిమానులకు అభివాదం చేస్తున్నారు.. అంతేకాదు నేతలతో చర్చలు జరుపుతున్నారు.. కానీ ఇంతటి మెగా ఈవెంట్ లో కేటీఆర్ కనిపించడం లేదు. కనీసం ఆయన బిఆర్ఎస్ ప్రస్తావన కూడా తీసుకురావడం లేదు..
ఏమైంది
పార్టీ పరంగా జరిగే ప్రతి కార్యక్రమానికి కేటీఆర్ హాజరవుతూ ఉంటారు. అన్నింట్లో చురుగ్గా పాల్గొంటు ఉంటారు.. మాట్లాడే అవకాశం కూడా ముందుగా ఆయనే తీసుకుంటారు.. టిఆర్ఎస్ ప్రాంతీయ పార్టీగా ఉన్నప్పుడే కెటీఆర్ ఇంత హంగామా చేస్తే.. జాతీయ పార్టీగా మారితే ఎంత హడావిడి చేయాలి? కానీ అవి ఏమి కేటీఆర్ ముఖంలో కనిపించడం లేదు.. పైగా తాను పాల్గొనే ఏ సమావేశంలోనూ బీఆర్ఎస్ ప్రస్తావన తీసుకురావడం లేదు. వాస్తవానికి జాతీయ పార్టీగా మారిన తర్వాత బీఆర్ ఎస్ పార్టీకి సంబంధించి ఢిల్లీలో కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు. దీనికి కీలక నేతలు మొత్తం హాజరు కావాలని ప్రగతిభవన్ నుంచి ఆదేశాలు వెళ్లాయి.. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుగానే మంత్రులందరూ ఢిల్లీ చేరుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఉన్నప్పుడు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ ఉన్నారు.. ఇప్పుడు కూడా ఆయన అధికారికంగా ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంటే.. అయినప్పటికీ ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి కార్యాలయ ప్రారంభోత్సవానికి దూరంగానే ఉన్నారు.. హైదరాబాదులో ముఖ్యమైన సమావేశాలు ఉన్నందున వెళ్లడం లేదని కేటీఆర్ సన్నిహితులు చెబుతున్నారు.

కానీ భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రారంభోత్సవం కన్నా అంత ముఖ్యమైన కార్యక్రమాలు ఏం ఉంటాయని రాజకీయ విశ్లేషకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు కల్వకుంట కవిత ఒకరోజు ముందుగానే ఢిల్లీకి చేరుకున్నారు. అంతేకాదు ఇటీవల ఆమెకు మైకు దొరికితే చాలు భారత రాష్ట్ర సమితి గురించే మాట్లాడుతున్నారు.. కానీ దీనిపై కేటీఆర్ పెద్దగా మాట్లాడటం లేదు. అయితే కేసీఆర్ కుటుంబంలోనే భారత రాష్ట్ర సమితి విషయంపై ఏదో అంతర్గత చర్చ నడుస్తోంది అనే అభిప్రాయం వినిపిస్తోంది.. అయితే కేటీఆర్ రాష్ట్ర రాజకీయాలకు మాత్రమే పరిమితమని… కవితను మాత్రం జాతీయ రాజకీయాల్లో కీలకం చేయాలనుకుంటున్నారని చెబుతున్నారు.. అందుకే కేటీఆర్ భారత రాష్ట్ర సమితి కార్యాలయ ప్రారంభానికి దూరంగా ఉన్నారని భావిస్తున్నారు.. గతంలో పార్టీ, ప్రభుత్వ పదవుల పంపకం విషయంలో కేటీఆర్, కవిత మధ్య విభేదాలు వచ్చాయని విస్తృతంగా ప్రచారం జరిగింది.. అంతేకాదు కొంతకాలం పాటు నమస్తే తెలంగాణ పత్రికలో కవిత పేరు కనిపించలేదు. తర్వాత అంతా సర్దుకున్నట్టే కనిపించింది.. అయితే వీరిద్దరి మధ్య మరోసారి విభేదాలు రాకుండా ఉండేందుకు కేసిఆర్ కవితను జాతీయ రాజకీయాలకు, కేటీఆర్ ను రాష్ట్ర రాజకీయాలకు పరిమితం చేశారని తెలుస్తోంది. అందులో భాగంగానే కేటీఆర్ భారత రాష్ట్ర సమితి వ్యవహారాల్లో కలుగజేసుకోవడం లేదని సమాచారం.