Minister Gudivada Amarnath: విశాఖ నగర ప్రముఖులు ఆయుధ బాట పడుతున్నారు. స్వియ రక్షణ కోసం గన్ లు కావాలని పోలీస్ శాఖకు దరఖాస్తు చేసుకుంటున్నారు. పాలనా రాజధానిలో శాంతి భద్రతలు భేష్ అంటూ పోలీస్ బాస్ ల ప్రకటనలు వారికి స్వాంతన చేకూర్చడం లేదు. తమ ఆత్మరక్షణ కోసం గన్ లు కావాల్సిందేనని పట్టుబడుతున్నారు. అయితే ఈ జాబితాలో మంత్రి అమర్నాథ్ కూడా ఉండడం విశేషం. ఇప్పటికే మంత్రి హోదాలో పటిష్ట భద్రత ఆయనకు ఉంది. కానీ తనకు సొంతంగా గన్ ఉండాలని భావిస్తుండడం సాగరనగరంలో శాంతిభద్రతల దుస్థితిని తెలియజేస్తోంది.
విశాఖ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ తరువాత ప్రజాప్రతినిధులు ఉలిక్కిపడ్డారు. గన్ అవసరం ఏపాటిదో వారికి తెలిసి వచ్చింది. పవర్, హోదాలు ఏం చేయలేవని..అన్నింటికీ స్వీయ రక్షణే శ్రీరామరక్ష అని వారు బలంగా నమ్ముతున్నారు. అందుకే వ్యాపారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు గన్ ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. మొన్నటి కిడ్నాప్ ఘటన తరువాత ఎంపీ సత్యనారాయణ, ఆయన కుమారుడు శరత్ చౌదరిలకు పోలీస్ శాఖ నుంచి సూచన వెళ్లింది. దీంతో వారు గన్ ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తమపై భవిష్యత్ లో దాడులు జరిగే అవకాశముందన్న భయంతోనే వారు గన్ లు పొందేందుకు ముందుకొచ్చినట్టు తెలుస్తోంది.
విచిత్ర ఏమిటంటే తనకు కూడా గన్ కావాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ దరఖాస్తు చేసుకోవడమే. ఇప్పటికే సీఎం తరువాత హై సెక్యూరిటీ ఉన్న మంత్రుల్లో అమర్నాథ్ ఒకరు. ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా ఆయనకు సమకూర్చారు. అయినా ఆయన ప్రభుత్వ భద్రతతో పెద్దగా సంతృప్తి పడలేదు. ఇటీవల జరుగుతున్న పరిణామాలతో ఎందుకైనా మంచిది తనకు ఒక గన్ ఉండాలని భావిస్తున్నారు. ప్రభుత్వ భద్రత ఉంటే మరో పది నెలలు. తరువాత ఎలాగూ పర్సనల్ భద్రత ఉండాలన్న భావనతోనే అమర్నాథ్ గన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని సెటైర్లు పడుతున్నాయి.
గన్ లైసెన్స్ జారీకి పోలీస్ శాఖ అనుమతి తప్పనిసరి. పోలీస్ స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ఉండాలి. ప్రస్తుతం విశాఖ నగరంలో 600 మందికి గన్ లైసెన్స్ లు ఉన్నాయి. ఇందులో 400 మందికిపైగా మాజీ సైనికులే. వీరు వివిధ బ్యాంక్, వాణిజ్య సంస్థల్లో సెక్యూరిటీ గార్డ్స్ గా పనిచేస్తున్నారు. మిగతా వారంతా రాజకీయ, వ్యాపార ప్రముఖులే. అయితే మొన్నటి ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ తరువాత పోలీస్ శాఖ గన్ లైసెన్స్ దరఖాస్తులు అమాంతం పెరిగినట్టు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.