Minister Gudivada Amarnath: వైసీపీకి దసరా ఫీవర్ పట్టుకుంది. విజయదశమి పర్వదినం నాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని మంత్రులు పాట పాడడం ప్రారంభించారు. అయితే అందులో విశేషం ఏముంది అన్న ప్రశ్న ఉత్పన్నమవడం సహజమే. ఎందుకంటే ఇలాంటి గడువులు వైసీపీ ఏలుబడిలో సహజం. ఒక్క సంక్షేమ పథకాల బటన్ నొక్కుడు తప్పించి.. అభివృద్ధి పనుల్లో గడువులు,లక్ష్యాలు చాలా చూశాం. రోడ్లు వేస్తామంటారు.. పలానా రోజు నాటికి ఆ రోడ్డు అలా ఉండదంటారు. తీరా గడువు మించిపోయినా పట్టించుకునే వారే కరువవుతారు. ఏపీలో గత నాలుగేళ్లుగా ఇలాంటి గడువులకు కాలం చెల్లాయి.
అయితే తాజాగా యువ మంత్రి గుడివాడ అమర్నాథ్ దసరాకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెబుతుందని ప్రకటించారు. సహజంగా ఎక్కువగా అమర్నాథ్ మాట్లాడేది విశాఖ పాలన పైనే. ఆయన చాలా సందర్భాల్లో ఈ గుడ్ న్యూస్ ల మీద ప్రకటనల మీద ప్రకటనలు చేసేసారు. దీంతో ఆయన చెబుతున్నా ప్రజలు లైట్ తీసుకుంటున్నారు. అయితే ఈసారి నేను చెబుతున్నది నిజమే అంటూ గుడివాడ పెద్ద సౌండ్ చేస్తున్నారు.
విశాఖ సహా ఉత్తరాంధ్రవాసులు అంతా ఒక శుభవార్తను ఈ దసరాకి వింటారని గుడివాడ తాజాగా చెప్పుకొచ్చారు. అంటే జగన్ విశాఖకు సీఎం ఆఫీసును షిఫ్ట్ చేస్తారన్నమాట. అయితే ఇదే మాటను ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి కూడా చెప్పుకొచ్చారు. అటు సీఎం క్యాంప్ ఆఫీస్ కు భవనాలు సైతం సిద్ధం చేసే పనిలో పడ్డారని తెలుస్తోంది. అయితే అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో అన్నది చూడాలి. కానీ మంత్రులు,కీలక నేతలు మాత్రం ఉత్తరాంధ్రకు ఏదో ఒక మహా ప్రాజెక్టు తీసుకొస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత వైసీపీలో ఓ రకమైన నైరాష్యం వచ్చింది. విశాఖ నగరం తో పాటు ఉత్తరాంధ్రవాసుల అభిప్రాయం ప్రభుత్వానికి గుణపాఠం నేర్పింది. అటు పాలనా రాజధాని ఏర్పాటు చేయక.. ఉన్న అమరావతిని నిర్వీర్యం చేస్తున్న తీరుపై ప్రజాగ్రహం వ్యక్తం అయ్యింది. అదే సమయంలో విశాఖ రాజధానికి ప్రజలు పెద్దగా ఆహ్వానించలేదు. రాజధాని వస్తే జరగబోయే పరిణామాలపై సాగర నగరవాసులు కలత చెందుతున్నారు. కానీ ఇవేవీ జగన్ కు పట్టడం లేదు. విశాఖ పాలన రాజధానికి న్యాయ అడ్డంకులు ఉన్న దృష్ట్యా… సీఎం క్యాంప్ ఆఫీస్ ను ప్రారంభించి తన చర్యలను బలపరుచుకోవాలని చూస్తున్నారు.
ఇప్పుడు ఎన్నికలు సమీపించడంతో ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి జగన్ ఏర్పడింది. అటు అమరావతి రాజధాని లేదు. ఇటు విశాఖకు పాలనా రాజధాని తరలి రాలేదు. మరోవైపు చూస్తే కేసు కోర్టులో ఉంది. ఇప్పట్లో విచారణకు వచ్చే అవకాశం లేదు.ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఏదో ఒకటి చెప్పాలి. చెప్పాలంటే ఏదో ఒకటి చేయాలి. అందుకే దసరా నుంచి సీఎం క్యాంప్ ఆఫీసును విశాఖలో ప్రారంభించాలని జగన్ భావిస్తున్నారు. దానిని మంత్రులు గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు గుడ్ న్యూస్ గా చెబుతున్నారు.