Homeఆంధ్రప్రదేశ్‌Minister Dharmana Prasada Rao: జగన్ పరువు తీయడానికి ‘ధర్మాన’ ఒక్కడు చాలు..

Minister Dharmana Prasada Rao: జగన్ పరువు తీయడానికి ‘ధర్మాన’ ఒక్కడు చాలు..

Minister Dharmana Prasada Rao: ఇటీవల సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు. మంచి వాగ్ధాటి, సమయస్పూర్తితో మాట్లాడగలరన్న పేరు ధర్మాన సొంత. అయితే ఇటీవల ఎందుకో ఆయన మాటలు గాడి తప్పుతున్నాయి. ప్రజలకు భయపెట్టేలా ఉన్నాయి. అధినేత ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ఉన్నాయి. జగన్ గొప్పతనాన్ని చెప్పే క్రమంలో ఆయన గురించి లేనిపోని మాటలను అనేస్తున్నారు. శ్రీకాకుళంలో ఎప్పుడు ప్రసంగించినా ఆయన జగన్ ఇమేజ్ ను పిచ్చోడు, క్రాక్ రేంజ్‌లోనే ఉంచుతున్నారు. దీంతో ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అధినేత గురించి రాంగ్ గా మాట్లాడేసరికి పార్టీ శ్రేణులు కూడా ధర్మానకు ఏమైందని ప్రశ్నిస్తున్నారు. గతంలో ధర్మాన ప్రసంగానికీ.. ఇప్పటికీ తేడాను గమనిస్తున్నారు.

ప్రజలను బెదిరించేలా..
మూడు రాజధానులపై లోతైన అధ్యయనం చేసి ధర్మాన చాలా సందర్భాల్లో మాట్లాడారు. శాసనసభలో సైతం సుదీర్ఘ ప్రసంగం చేశారు. కానీ ఉత్తరాంధ్ర, ముఖ్యంగా సొంత జిల్లా శ్రీకాకుళం జిల్లా ప్రజలకు పెద్దగా రుచించలేదు. కనీసం తన మాటలతో వారిని ఆకట్టుకోలేకపోయారు. మీరింకా సైకిల్ గుర్తు మాయను వీడలేదంటూ ప్రజలపై చిరాకు పడిపోయారు. అక్కడితో ఆగకుండా ఓటర్లను బెదిరించేలా మాట్లాడుతున్నారు. ఆ మధ్య మహిళలు సహజంగా మాట్లాడే మాటలను గుర్తుచేస్తూ సభలు, సమావేశాల్లో ప్రస్తావించారు. దీంతో విసిగి వేశారిపోయిన స్వయం సహాయక సంఘాల మహిళలు గోడలు, గేట్లుదూకి వెళ్లిపోయారు. దీంతో వారి విషయంలో సైతం ధర్మాన బెదిరింపులకు దిగారు. భయపెట్టేలా మాట్లాడారు.

జనాలు అంటున్నారని…
ఇప్పుడు కొత్తగా అధినేత జగన్ పై ధర్మాన పడ్డారు. ఎక్కడకు వెళ్లిన జగన్ సైకో, క్రాక్ అంటున్నారని.. ఇది పద్ధతి కాదని హెచ్చరిస్తున్నారు. సీఎం జగన్‌ను పిచ్చోడు, క్రాక్ అంటున్నారని .. మీకు ఇష్టముంటే ఓటేయండి లేకపోతే మానేయండి అంతే కానీ సీఎం జగన్ ను ఇలా అంటారా? అని జనాన్ని ప్రశ్నిస్తున్నారు.అయితే పదే పదే ధర్మాన ఆ ప్రస్తావన చేయడం కూడా పార్టీ శ్రేణులకు మింగుడుపడడం లేదు. అసలు పిచ్చోడు , క్రాక్ అని జనం ఎప్పుడు అన్నారని వారిలో వారే ప్రశ్నించుకుంటున్నారు. ధర్మాన ఎప్పుడు విన్నారో కానీ.. అందరూ జనం అభిప్రాయం ఇది అంటూ ప్రచారం వ్యాప్తి చెందడానికి కారణమవుతున్నారు.

పదేపదే అవే మాటలు..
జగన్ లేకుండా జనం బతకలేరన్న రేంజ్ ధర్మాన మాట్లాడుతున్నారు. అయితే గతంలో జగన్ గురించి ధర్మాన చేసిన వ్యాఖ్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు జనం అనుకుంటున్నారన్న మాటలనే.. అప్పుడు ధర్మాన కామెంట్స్ కూడా చేశారు. అప్పుట్లో జగన్ కు వ్యతిరేకంగా ధర్మాన కామెంట్స్ వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతుంటాయి. కానీ ఇప్పుడు జగన్ మంత్రివర్గంలో ఉన్న ధర్మాన ఆయనపై ఈగ వాలనివ్వకూడదు అనుకున్నారో ఏమో కానీ పదేపదే అవే మాటలు అనడం ద్వారా ప్రజల్లో కూడా బలమైన వ్యతిరేకత ఉందని ప్రస్తావించినట్టవుతుందన్న టాక్ నడుస్తోంది. ఎన్నికలు సమీపించే కొలదీ మంత్రి ధర్మాన వ్యాఖ్యలు మరింత ముదిరిపాకాన పడే అవకాశముంది. ఇక జగన్ కట్టడి చేస్తారో చూడాలి మరీ.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version