Minister Appalaraju: ఏపీ సీఎం జగన్ అంటే ఆ నేతలకు వైబ్రేషన్ వచ్చేస్తోంది. ఆ మాట వింటేనే వారు పులకించి పోతున్నారు. ఆయన మాటనే పాటగా మలిచి డ్యాన్సులతో హోరెత్తిస్తున్నారు. తమ స్థాయిని మరిచి, మైమరచిపోయి గాయకుడిగా, డాన్సర్ గా పరకాయ ప్రవేశం చేస్తున్నారు. ఈ జాబితాలో కొందరు మంత్రులు కూడా ఉండడం విశేషం. అంబటి రాంబాబు, ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్ వంటి మంత్రులు ఈపాటికే తమ ప్రతాపాన్ని చూపారు. ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో మంత్రి సీదిరి అప్పలరాజు చేరారు.
అధినేత జగన్ పై ఈగ వాలిన వీరు తట్టుకోలేరు. ప్రత్యర్థులకు నోటితో సమాధానం చెబుతారు. ఇక ఆనందం వస్తే తట్టుకోలేరు. ఏకంగా అధినేత పైనే పాటల సృష్టించి మరీ పాడుతారు. తాము ఒక ఉత్తమ గాయకులుగా తన్మయత్వం చెంది.. ప్రజలను తన్మయం చేయాలని చూస్తారు. శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో ఆదివారం మంత్రి అప్పలరాజు గాయకుడిగా అవతారం ఎత్తారు. తానే సొంతంగా లిరిక్స్ రాసి.. దానికి ట్యూన్ కట్టి.. స్వయంగా తానే పడేశారు. సంగీతం, గానంతో పార్టీ శ్రేణులకు ఉర్రూతలూగించారు. అయితే అయిష్టంగా నైనా స్వయంగా తమ మంత్రి పాట పాడడంతో, అది కూడా అధినేత జగన్ కోసం కావడంతో వైసీపీ శ్రేణులు సైతం కేరింతలు కొట్టారు.
వైసిపి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సామాజిక సాధికార యాత్రలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆదివారం పలాసలో యాత్ర చేపట్టారు. అయితే ఈ యాత్ర కోసం ప్రజలను చుక్కలు చూపించారు. శనివారం రాత్రి నుంచి పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏకంగా ప్రధాన రహదారిని బ్లాక్ చేశారు. మంత్రి తీరుపై ప్రజలు బాహటంగానే విమర్శలు చేశారు. కానీ ఇవేవీ పట్టించుకోని అప్పలరాజు.. ఏకంగా స్టేజి ఎక్కి.. పాటలు పాడుతూ చిందులు వేయడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. మరి ఇంత లేకితనమా? అని విపక్షాలు విమర్శలకు దిగుతున్నాయి. అయితే అధినేత పల్లకి మోసే క్రమంలో మంత్రులు పోటీ పడుతున్న తరుణంలో.. ఆ జాబితాలో మంత్రి అప్పలరాజు చేరడం విశేషం. అయితే ఇవన్నీ చిల్లర వేషాలని.. హుందాను మరిచిన రాజకీయాలని సీనియర్ మంత్రులు వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం. ఇటువంటివి ప్రజల్లో మేలు కంటే కీడే చేస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.