Ambati Rambabu : ఏపీ మంత్రివర్గాన్ని డమ్మీగా ఎక్కువ మంది అభిప్రాయపడతారు. ఒకరిద్దరు తప్పితే చాలామంది తాము నిర్వర్తిస్తున్న శాఖ గురించి నాలెడ్జ్ అంతంతమాత్రమే. ఇది చాలా సందర్భాల్లో వెల్లడైంది. అయితే అంతా నవరత్నాలే కాబట్టి, అభివృద్ధి పనులకు చోటు లేదు కాబట్టి మంత్రులు కూడా తీరికగా గడుపుతున్నారు. బుగ్గ కారు, మందీ మార్భలంతో దర్జా వెలగబడుతున్నారు. శాఖల ప్రగతి వదిలి ప్రత్యర్థులపై విమర్శలు,అనుచిత వ్యాఖ్యలతో కాలం గడిపేస్తున్నారు. ఇలా అయినా మీడియాలో ప్రాధాన్యత దక్కుతుంది కదా అని భావించి రెచ్చిపోయిన వారూ ఉన్నారు. అటువంటి వారి వరుసలో అంబటి రాంబాబు ముందంజలో ఉంటారు. నిత్యం రంకెలు వేస్తూ ప్రత్యర్థులపై మాటలతో దాడి చేస్తుంటారు. కానీ తన వ్యక్తిగత జీవితాన్ని సైతం సీఎం జగన్ వద్ద తాకట్టు పెట్టేసినట్టు విమర్శలు మూటగట్టుకున్నారు.
నోటి దురుసుతో..
మంత్రి అంబటి వేషాలు చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఆయనపై లైంగిక సంబంధమైన ఆరోపణలు సైతం వచ్చాయి. కానీ జగన్ అనూహ్యంగా ఆయనకు మంత్రివర్గంలో చోటిచ్చారు. కీలకమైన నీటి పారుదల శాఖ ఇచ్చారు. అయితే అప్పటి నుంచి ఆయన ‘నోటి’పారుదలకు పరిమితమయ్యారన్న అపవాదును ఎదుర్కొంటున్నారు. తనకు అందుకోసమే శాఖను ఇచ్చారన్న రేంజ్ లో ప్రత్యర్థులను ఉతికి ఆరేస్తున్నారు. అయితే ఈ క్రమంలో తన వ్యక్తిగత జీవితాన్ని కూడా కోల్పోతున్నారు. ఆయనకు కనీసం జుట్టుకు రంగేసుకునే స్వేచ్చ కూడా లేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి పదవి ఇచ్చిన కొత్తలో అంబటి రాంబాబు హెయిర్ డై వేసుకుని వెళ్తే జగన్ చిరాకు పడ్డారని … పదవిలో ఉండాలంటే మరోసారి జుట్టుకు రంగేసుకోవద్దని హెచ్చరించారని చెబుతారు. అందుకే అంబటి రాంబాబు జుట్టుకు రంగేసుకోవడం మానేశారు.
కాపులపై అనుచిత వ్యాఖ్యలు
అయితే తన వ్యక్తిగత ఇష్టం ప్రకారం జుట్టుకు రంగేసుకోలేనంత దీన స్థితిలో ఉన్న రాంబాబు.. కాపుల గురించి..బానిసత్వం గురించి అతి మాటలు మాట్లాడుతున్నారు. ఇది వినేవారికి అసహ్యం కలిగిస్తోంది. జగన్ మెప్పు కోసం గతంలో ఓ చానల్ ఇంటర్యూలో కాపులపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. తర్వాత ఆయనకు మంత్రి పదవి వచ్చింది. అయితే తాజాగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. వైసీపీలోనే చర్చకు దారితీస్తున్నాయి.ఒక్క కాపు ఓటు కూడా వైసీపీకి రాకుండా ఆయన కుట్ర చేస్తున్నారన్న అనుమానాలు ఆయనపై వ్యక్తమవుతున్నాయి. కాపులపై అనుచిత వ్యాఖ్యలు తరచూ చేస్తూండటమే దీనికి కారణం. కాపులంతా పవన్ వెంట నడుస్తున్నారని.. పవన్ చంద్రబాబుకు అమ్ముడుపోయారంటూ చేస్తున్న వ్యాఖ్యలు కాపుల ఆగ్రహానికి కారణమవుతున్నాయి. అంతిమంగా వైసీపీని అభిమానించే కాపులు సైతం దూరమయ్యే ప్రమాదముంది. ఇదే విషయంపై వైసీపీ కాపు నేతలు కొందరు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. మరీ అధినేత ఎలా మందలిస్తారో చూడాలి మరీ.