కొరియోగ్రాఫర్ చైతన్య మరణం బుల్లితెర వర్గాల్లో కలకలం రేపింది. అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు చైతన్య సూసైడ్ వీడియోలో వెల్లడించిన నేపథ్యంలో… కారణాల అన్వేషణ కొనసాగుతుంది. ఈ క్రమంలో ఢీ కొరియోగ్రాఫర్స్ ఆ షోకి ఎదురు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఉందని తెలుస్తుంది. కొరియోగ్రాఫర్ ఆట సందీప్ ఈ మేరకు కీలక విషయాలు వెల్లడించారు. ఢీ షో వలనే చైతన్య అప్పులు చేసి ఉండొచ్చని అన్నారు. తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ఆట సందీప్ ఢీ షోలో కొరియోగ్రాఫర్స్ చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు వెల్లడించారు.
ఢీ మేకర్స్ ఒక్కో పాటకు గాను కొరియోగ్రాఫర్స్ కి రూ. 30000 ఇస్తున్నారు. ఈ డబ్బులతో డాన్సర్స్ కావలసిన కాస్ట్యూమ్స్, ప్రాపర్టీస్, ఫుడ్, రెమ్యూనరేషన్, ట్రావెలింగ్ చార్జెస్ ఏర్పాటు చేయాలి. ఒక కూలి రోజుకు వెయ్యి రూపాయలు తీసుకుంటున్న రోజుల్లో ఒక్కో సాంగ్ కి నాలుగైదు రోజులు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. నిర్మాతలు ఇచ్చిన డబ్బులు ఏమాత్రం సరిపోవు. ఢీ షో ద్వారా నేమ్ తెచ్చుకోవాలని కొరియోగ్రాఫర్స్ అప్పులు తెచ్చి సాంగ్స్ ని ఉన్నతంగా చేస్తున్నారు.
చైతన్య అప్పులు కావడానికి ఇది కూడా ఒక కారణం. జబర్దస్త్ కమెడియన్స్ కి ఇచ్చే మొత్తంతో పోల్చితే ఢీ వాళ్లకు చాలా తక్కువ రెమ్యూనరేషన్స్ ఇస్తున్నారు. డాన్సర్స్ కి ఒక రూపాయి ఇవ్వడానికి బేరాలు ఆడతారు. డాన్సర్స్ కి కనీస గౌరవం ఉండదు. చులకనగా చూస్తారంటూ… ఆట సందీప్ చెప్పుకొచ్చారు. చైతన్య చాలా మంచివాడు. ఒక ప్రైవేట్ ఆల్బమ్ చేస్తున్నానని నాతో చెప్పాడు. అతడు ఆత్మహత్య చేసుకోకుండా ఉండాల్సింది. మాతో తన బాధ చెప్పుకుంటే ఇంతవరకు వచ్చేది కాదన్నారు
ఏప్రిల్ 30న నెల్లూరు క్లబ్ హోటల్ లో చైతన్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డాన్స్ డే సందర్భంగా అక్కడ ఆయనకు సన్మానం జరిగింది. అనంతరం అదే హోటల్ లో చైతన్య ఉసురు తీసుకున్నారు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ వీడియో రికార్డు చేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తాను డబ్బులు ఇవ్వాల్సిన ప్రతి ఒక్కరికీ సెల్ఫీ వీడియోలో చైతన్య క్షమాపణలు చెప్పారు. చివరిగా పేరెంట్స్ ని తలచుకున్నారు.