దేశవ్యాప్తంగా కొవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం, ఏపీలో తొలి కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణకు కేంద్రం సూచనల మేరకు బ్రిటిష్ కాలంనాటి 1897 చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
కరోనా ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని అన్ని స్కూళ్లకు ఈనెల 18 వరకు సెలవులు ప్రకటించారు. జనం గుమిగూడిన ప్రాంతాలకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. విదేశాల నుంచి వచ్చిన 125 మంది ఆచూకీపై అధికారులు ట్రాక్ చేశారు.
నెల్లూరులోని ఓ హోటల్‌లో 30 మంది పోర్చుగల్ వాసులకు సంబంధించిన శాంపిల్స్‌ను అధికారులు పరీక్షలకు పంపించారు. కరోనాపై వదంతులు, నిరాధార వార్తలను ప్రజలు నమ్మొద్దని కోరారు.
ఈ చట్టానికి ‘ఆంధ్రప్రదేశ్ అంటువ్యాధి కొవిడ్-19 రెగ్యులేషన్ 2020’గా నామకరణం చేస్తూ శుక్రవారం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దీని ప్రకారం శుక్రవారం నుంచే ఈ చట్టం రాష్ట్ర మొత్తం అమలులోకి వచ్చింది. ఇది ఏడాదిపాటు అమల్లో ఉంటుంది.
ఈ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు రాష్ట్రస్థాయిలో ఆరోగ్యశాఖ డైరెక్టర్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన్ పరిషత్ కమిషనర్‌కు మరిన్ని అధికారాలు అప్పగించింది. జిల్లాస్థాయిలో కలెక్టర్, వైద్యాధికారి, బోధనాసుపత్రి సూపరింటెండెంట్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్లకు బాధ్యతలు అప్పగించింది.
ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సంస్థలు పూర్తిగా కరోనా నియంత్రణ కోసం పని చేయాలి. అవసరమైన చోట ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసుకుని అనుమానితులను చికిత్స అందించాలి.
విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులకు దగ్గు, జలుబు, శ్వాససంబంధింత వ్యాధులు లేకపోయినా 14 రోజుల పాటు ఇంటిలోనే ఐసోలేషన్‌లో ఉండాలి. అనుమానుతులను 14 రోజులు ఇంటిలోనే ఐసోలేషన్‌లో ఉంచాలి. వైద్య సంస్థలు కానీ, వ్యక్తులు కానీ, అధికారులు కానీ ఆరోగ్యశాఖ అనుమతి లేకుండా మీడియాకు సమాచారం ఇవ్వడానికి వీల్లేదు. ఒకవేళ అందిస్తే దీన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు.
కరోనా లక్షణాలున్న వారిని సెక్షన్-6 ప్రకారం సంబంధింత అధికారాలున్న వారు మాత్రమే చేర్చుకోవాలి. అనుమానితులు ఎవరైనా చికిత్సకు నిరాకరిస్తే అధికారులు బలవంతంగా వారిని ఆస్పత్రికి తరలించొచ్చు.
ఒక ప్రదేశంలో కరోనా కేసు నమోదైతే ఆ ప్రాంతంపై జిల్లా కలెక్టర్‌కు కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది. ప్రవేశాల నిషేధం, పాఠశాలలు, సినిమా హాళ్లు, వాణిజ్య సంస్థలు, కార్యాలయాలు, బహిరంగ సమావేశాలను నియంత్రించవచ్చు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం శిక్షార్హులు.
కరోనా కేసులు క్రమేపీ పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. జ్వరం, దగ్గు, జలుబు, ఆయాసం వంటి లక్షణాలతో వచ్చే వారి కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక ఓపీ నిర్వహించాలని నిర్ణయించింది. మరోవైపు ఏపీలోని ప్రముఖ దేవాలయాల వద్ద సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు.
తగిన సూచనలు, జాగ్రత్తలు వివరిస్తూ సైన్ బోర్డులు పెట్టారు. భక్తులు కూడా సహకరించాలని దేవాదాయశాఖ కోరుతోంది. రాష్ట్రంలో తిరుపతి తర్వాత విజయవాడలో కరోనా టెస్ట్ ల్యాబ్ అందుబాటులోకి రానుందని కేఎస్ చౌహర్ రెడ్డి తెలిపారు. వైరస్ వ్యాపించకుండా పలు చర్యలు తీసుకున్నామన్నారు.