
కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ కారణంగా అందరికన్నా ఎక్కువగా జీవన్మరణ సమస్యలు ఎదుర్కొంటున్నది భుక్తి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోయి, చిక్కుకు పోయిన వలస కార్మికులే. చాలీచాలని ఎన్ డి ఆర్ ఎఫ్ నిధులతో వారికి వసతి, భోజనం ఏర్పాటు చేయమని ఉచిత సలహా ఇచ్చి మౌనం వహించింది.
వారికి వసతి, భోజన సదుపాయాలు కల్పించ వలసిన బాధ్యత కేంద్రానిదే అని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్ధిక వెసులుబాటు కలిగించే ప్రయత్నం కూడా చేయడం లేదు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమకున్న పరిమితమైన వనరులతో వారికి వసతి, భోజనం కల్పిస్తున్నా కనీసం తమ స్వస్థలాలకు వెళ్లే అనుమతి ఇవ్వమని వలస కార్మికులు పలు చోట్ల ఆందోళనలకు దిగుతున్నారు.
వివిధ రాష్ట్రాలలో చిక్కుకు పోయిన తమ రాష్ట్రానికి చెందిన వలస కారిమికులను పంపేందుకు సహకరింపమని బీహార్, ఒడిశా ముఖ్యమంత్రులు కోరినా కేంద్రం స్పందించడం లేదు. అయితే ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం కొంత చొరవ తీసుకొంటున్నాయి.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సుమారు 1,000 బస్సు లను ఏర్పాటు చేసి, రాష్ట్ర సరిహద్దుల్లో చిక్కుకు పోయిన బీహార్ కు చెందిన వలస కార్మికులకు రవాణా ఏర్పాటు చేశారు. అట్లాగే రాజస్థాన్ లో చిక్కుకు పోయిన యూపీకి చెందిన విద్యార్థులను తీసుకు రావడానికి సహితం 300 బస్సులను పంపుతున్నట్లు ప్రకటించారు.
తాజాగా, మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ తో చిక్కుకుపోయిన లక్ష మందికి పైగా వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపేందుకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన కార్మికులు వేర్వేరు ప్రాంతాల్లోని 38 షుగర్ ఫ్యాక్టరీల్లో పని చేస్తున్నారు.
లాక్ డౌన్ తో పనులు నిలిచిపోవడం, రవాణా సౌకర్యం లేకపోవడంతో ఆ ఫ్యాక్టరీలే తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేసి భోజన సదుపాయం కల్పించింది. ఇటీవల వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్తామంటూ నిరసనలకు దిగుతున్న నేపథ్యంలో వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది మహారాష్ట్ర ప్రభుత్వం.
షుగర్ ఫ్యాక్టరీల్లో పని చేసే సుమారు లక్షా 31 వేల మంది కార్మికులను వారి సొంత జిల్లాలకు పంపేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి ధనంజయ్ ముండే తెలిపారు.