Weather Update: రాష్ట్రంలో చలిగాలుల ప్రభావం పెరుగుతోంది. చలి తీవ్రత ఎక్కువవుతోంది. దీంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు.అత్యంత దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలు విలవిలలాడుతున్నాయి. తక్కువ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో చలి మంటలువేసుకున్నా చలి తగ్గడం లేదు. ఫలితంగా జనం బయటకు రావడానికి జంకుతున్నారు.దీంతో పిల్లలు, ముసలి వారు వణికిపోతున్నారు. చలి బారి నుంచి రక్షించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.

సాధారణంగా సంక్రాంతి తరువాత చలి ప్రభావం తగ్గుతుంది. కానీ ప్రస్తుతం దాని తీవ్రత పెరుగుతోంది. ఫలితంగా పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న చలి గాలుల ప్రభావంతోనే అత్యంత దారుణంగా ఉష్ణోగ్రతలు తగ్గినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉపరితల ఆవర్తనం కూడా తోడవడంతో చలిగాలుల తీవ్రత మరింత ముదురుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.
Also Read: ఏపీలో ఉద్యోగులపై చర్యలకే ప్రభుత్వం సిద్ధమా?
ఆదిలాబాద్ జిల్లా అర్లి (టి) గ్రామంలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రత 4.9 డిగ్రీలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గత పదేళ్లలో ఇంత తక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే తొలిసారని అధికారులు ప్రకటించారు. ఉదయం వేళలో మంచు దుప్పటి కప్పుకుంటోంది. ఎనిమిది గంటల వరకు సూర్యుడు కనిపించడం లేదు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం విధులకు వెళ్లేవారికి తిప్పలు తప్పడం లేదు. చలి తీవ్రతతో రక్షణకు స్వెటర్లు కప్పుకుంటున్నా చలి ఆగడం లేదు. ఫలితంగా ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతం.
ఉత్తరాదిలో ఏర్పడిన చలిగాలుల తీవ్రత దక్షిణాదికి వీస్తోంది. హిమాలయ ప్రాంతాల్లోని గాలులప్రభావమే చత్తీస్ గడ్ మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో చలినుంచి రక్షించుకునేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తోంది. ఉత్తర, ఈశాన్య ప్రాంతాల నుంచి వీచే గాలులతో పెను ప్రభావం చూపుతోంది. వాతావరణ శాఖ అధికారులు ఈ విధంగా మరో రెండు రోజులు ఉండే అవకాశం ఉందని సూచిస్తున్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. చలి గాలి నుంచి రక్షించుకునేందుకు వేడి పదార్థాలను తీసుకోవాలని వెల్లడిస్తున్నారు.
Also Read: రాజ్యసభకు వెళ్లేది ఆ నలుగురేనా? జగన్ మదిలో ఏముందో?