Messi ignores politicians: మనదేశంలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఏదైనా చేయగలరు. ఎవరినైనా తమ వద్దకు తీసుకు రాగలరు. వారితో ఎలాంటి పనైనా చేయగలరు. చేయించగలరు. ముకేశ్ అంబానీ తన కుమారుడి పెళ్లి కోసం హాలీవుడ్ సింగర్లను సైతం ముంబై తీసుకొచ్చారు. వారితో పాటలు పాడించారు. డాన్సులు కూడా వేయించారు. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి మన దేశంలో చాలా జరిగాయి.. జరుగుతూనే ఉన్నాయి.
గోట్ టూర్ ఆఫ్ ఇండియా లో భాగంగా అర్జెంటీనా ఫుట్బాల్ ఆటగాడు మెస్సి మనదేశంలోకి వచ్చాడు. కోల్ కతా, హైదరాబాద్, ముంబై నగరాలలో పర్యటించాడు. కోల్ కతా ప్రాంతంలో నిర్వహించిన మెస్సి టూర్ నవ్వుల పాలైంది.. సరైన నిర్వహణ ఏర్పాట్లు లేకపోవడంతో ప్రేక్షకులు మైదానంలో బీభత్సం సృష్టించారు. మెస్సి ని చూడలేకపోయామనే బాధతో రణరంగం సృష్టించారు.
వాస్తవానికి కోల్కతా ఘటనను దృష్టిలో పెట్టుకున్న హైదరాబాద్ పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా మెస్సి టూర్ సాగే విధంగా భద్రత కల్పించారు. మెస్సీ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా ఫుట్బాల్ ఆడారు. ఆయనను సత్కరించారు. తన మనవడితో ఫోటోలు కూడా దిగే అవకాశాన్ని పొందారు. హైదరాబాద్ మాత్రమే కాదు ముంబై నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో కూడా మెస్సి తో ఫోటోలు దిగడానికి రాజకీయ నాయకులు పోటీపడ్డారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మెస్సి రాకను చూసి పరవశించిపోయారు.
గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో మెస్సీ అనేక రకాలుగా సందడి చేశాడు. ఫుట్బాల్ ఆడాడు. అయితే అతడు భారతదేశంలో పర్యటించిన దృశ్యాలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు ఈ అర్జెంటీనా ఆటగాడు. ఈ వీడియోలో రేవంత్ రెడ్డి లేడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అంతకంటే లేడు. ఆ వీడియోలో కొంతమంది చిన్నారులు ఉన్నారు. ఆ చిన్నారుల తర్వాత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఉన్నాడు. ముంబైలో పర్యటించినప్పుడు సచిన్ టెండూల్కర్ ద్వారా ఒక జెర్సీని మెస్సి పొందాడు. సచిన్ తో కొంతసేపు మాట్లాడాడు. అతడితో అనేక విషయాలను పంచుకున్నాడు..
వాస్తవానికి మెస్సీ టూర్ కోసం రాజకీయ నాయకులు ఎంతో గొప్పగా ఏర్పాట్లు చేశారు. పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. స్పాన్సర్లను వెతికి మరి రకరకాల ప్రయత్నాలు చేశారు. విపక్షాల నుంచి మాటల దాడి ఎదురైనప్పటికీ పకడ్బందీగా తిప్పి కొట్టారు.. కానీ మెస్సీ మాత్రం రాజకీయ నాయకులను ఏమాత్రం పట్టించుకోలేదు. ఆ సందర్భంలో పలకరించాడు అంతే. తనకు తప్పదు కాబట్టి కొద్దిసేపు మైదానం నటించాడు. కానీ అతని మనసులో ఉన్నది ముమ్మాటికి క్రీడా స్ఫూర్తి. అందువల్లే సచిన్ ఉన్న దృశ్యాలకు సంబంధించిన వీడియో మాత్రమే అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు.. డబ్బున్న శ్రీమంతుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే.. వారు తాత్కాలిక ఆధిపత్యాన్ని మాత్రమే సాధించగలరు.. డబ్బులు వెదజల్లి కొంతసేపు ఆ సౌఖ్యాన్ని అనుభవించగలరు. కానీ నిజమైన స్ఫూర్తిని ఎప్పటికీ కొనుగోలు చేయలేరని మెస్సి ఈ వీడియో ద్వారా నిరూపించాడు.