Mega Compound: మెగా కాంపౌండ్ వాల్ నుంచి వచ్చిన వారంతా కథానాయకులుగా ఎదిగారు. సినిమా రంగంలో రాణిస్తున్నారు. చిరంజీవి సినిమాతో పాటు సేవారంగంలో ఉన్నారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకుతో పాటు విపత్తుల సమయంలో సేవలందిస్తున్నారు. ఒక్క పవన్ కళ్యాణ్ సిని, రాజకీయరంగంలో కొనసాగుతున్నారు. అయితే అల్టిమేట్ గా కుటుంబ సభ్యులందరిదీ ప్రజాసేవే. తాజాగా ఆ కుటుంబ హీరోలంతా భారీ ఉదారతకు ముందుకొచ్చారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు కుటుంబాలకు భరోసా కల్పిస్తూ పవన్ యాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ఒక్కో రైతు కుటుంబానికి రూ.లక్ష అందిస్తున్న విషయం విదితమే. ఇందు కోసం పవన్ సొంత డబ్బులతో నిధి ఏర్పాటుచేశారు. ఆ సొమ్మునే కౌలురైతు కుటుంబాలకు అందిస్తున్నారు. ఇప్పటికే అనంతపురం, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో పర్యటించిన ఆయన.. ప్రకాశం జిల్లాలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పవన్ కు తన కుటుంబం అండగా నిలిచింది. మేనల్లుళ్లు, అన్నయ్య బిడ్డలు అండగా నిలిచారు. సాగు నష్టాలు, ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణాలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాలకు అండగా ఉండాలనే సదుద్దేశంతో పెద్ద మనస్సు చేసుకుని రూ.35 లక్షల విరాళం అందించారు. ఆ మొత్తాన్ని పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌కి అందించారు.

అయితే ఎప్పుడూ కుటుంబసభ్యుల గురించి మాట్లాడని పవన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. “మేము ఇంట్లో ఎప్పుడు కూడా రాజకీయాలు గురించి మాట్లాడుకోం. కుటుంబ సభ్యులుగా రాజకీయాల్లో నేను ఉన్నత స్థానానికి వెళ్లాలని కోరుకుంటారు తప్ప… రాజకీయాల గురించి నాతో చర్చించరు. జనసేన పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర చూసి, ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాల దయనీయ స్థితి గురించి తెలుసుకొని కదిలిపోయారు. వారి బిడ్డల భవిష్యత్తుకు ఎంతోకొంత అండగా ఉండాలనే సదుద్దేశంతో ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందించారు. కథానాయకులు వరుణ్ తేజ్ రూ.10 లక్షలు, సాయిధరమ్ తేజ్ రూ.10 లక్షలు, వైష్టవ్ తేజ్ రూ.5 లక్షలు, నిహారిక రూ.5 లక్షలు అందించారు. వీళ్ళు రాజకీయంగా తటస్థంగా ఉంటారు. రైతుల కష్టాలకు చలించిపోయారు. వీరిలో సేవా దృక్పథం ఉంది” అంటూ వారిని అభినందించారు.

సాయిధరమ్ తేజ ఇప్పటికే ఒక వృద్ధాశ్రమాన్ని నిర్మించాడని.. ఓ పాఠశాలకు తన వంతు అండగా నిలిచి సేవ చేస్తున్నాడని పవన్ కల్యాణ్ చెప్పారు. వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక తోడ్పాటు ఇస్తూ సామాజిక సేవల్లో భాగమవుతున్నారన్నారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల స్థితిగతులు, వారి బిడ్డలు చదువులకు ఇబ్బందులుపడుతున్న విషయం తెలుసుకొని స్పందించారని.. వారికి అండగా నిలవాలని ఆకాంక్షించారని వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు కుటుంబాలకు అండగా నిలిచేందుకు స్పందించి ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. ఈ మధ్య ఒక చిన్న పాప తాను దాచుకున్న కిడ్డీ బ్యాంకును తీసుకొచ్చి నాకు ఇచ్చింది. ఆ చిన్నారి తల్లిదండ్రులకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని పవన్ చెప్పారు.