Chiranjeevi- Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా సమస్యలపై పోరాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ.. అధికార వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ‘తమ్ముడు’కు.. త్వరలోనే ‘అన్నయ్య’ తోడు కానున్నాడా అంటే పొలిటికల్ సర్కిల్స్ నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఏపీ రాజకీయ తెరపై త్వరలోనే మెగా కాంబినేషన్ కనిపించబోతుందని రాజకీయ విశ్లేషకులూ అంచనా వేస్తున్నారు. జన సేనాని పవన్ కళ్యాణ్ కోసం ఆయన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి నేరుగా రంగంలోకి దిగబోతున్నారు. ఇప్పటికే రాజకీయంగా పవన్‌కు తన మద్దతు ఉంటుందని ప్రకటించిన చిరంజీవి త్వరలోనే తమ్ముడికి గాడ్‌ఫాదర్‌లా.. రాజకీయ సలహాదారు పాత్ర పోషించబోతున్నారని పొలిటికల్ టాక్.

పవనే సరైనోడు..
ప్రస్తుత రాజకీయాలకు పవన్ కళ్యాణ్ సరైనోడని మెగాస్టార్ చిరంజీవి కితాబిచ్చారు. తిడతాడు.. పడతాడు అని పేర్కొన్నారు. ఈ రాజకీయాలకు సరిపోతాడని.. త్వరలో అత్యున్నత స్థానం దక్కించుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘పవన్ నా తమ్ముడు.. నా సహకారం ఎందుకు ఉండదు’’ అని ప్రశ్నించిన మెగాస్టార్.. ఇక, పవన్ కోసం రంగంలోకి దిగేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
‘గాడ్‌ఫాదర్’లాగా..
మెగాస్టార్ చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్ తన అన్నకు అన్నివిధాలా అండగా నిలిచారు. యువరాజ్యం అధ్యక్షుడిగా పార్టీలో కీలక పాత్ర పోషించారు. అర్జునుడికి యుద్ధంలో రథసారధిగా మారిన శ్రీకృష్ణుడిలా.. చిరంజీవి ప్రజారాజ్యాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పవన్ ప్రాత ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. ఈ క్రమంలో ప్రస్తుతం పవన్ స్థాపించిన జనసేన పార్టీ.. ఏపీలో కీలక దశలో ఉంది. ప్రజాసమస్యలపై పోరాడుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోంది. 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో కీలక పోరులో తమ్ముడికి రాజకీయంగా గాడ్‌ఫాదర్‌లా నిలవాలని చిరంజీవి భావిస్తున్నారు. ‘‘రాజకీయాలకు నేను దూరమైనా.. రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు’’ అని నిరూపించుకోబోతున్నారని సమాచారం.

మెగా‘స్టార్ క్యాంపెయినర్’..
తమ్ముడు పవన్ కోససం చిరంజీవి రాజకీయ నాయకుడిగా కాకుండా.. స్టార్ క్యాంపెయినర్ అవతారంలో ‘మెగా’ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు కొంత కాలం క్రితం జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్.. ‘‘పవన్‌కు చిరంజీవి మద్దతు ఉంది.. జనసేనాని కోసం మెగాస్టార్ వస్తారు’’ అని ప్రకటించారు. చిరంజీవి ఇచ్చిన సంకేతం మేరకు మనోహర్ ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే పొలిటికల్ తెరపై మెగా ఎంట్రీ ఖాయమని ప్రచారం జరుగుతోంది.