CM Revanth Reddy: తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి 10 ఏళ్ల తర్వాత అధికారం దక్కింది. ఇది కూడా బంపర్ మెజారిటీ ఏం కాదు. 64+ సీపీఐ తో కలిపి ప్రజలు 65 సీట్లు మాత్రమే ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీకి 39 సీట్లు ఇచ్చారు. సో మొత్తానికి తెలంగాణ ప్రజలు విలక్షణమైన తీర్పు ఇచ్చారు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి ఎంత కృషి చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత రాష్ట్ర సమితి నాయకులు తిట్టిన తిట్లు భరించారు. చేసిన విమర్శలను తట్టుకున్నారు. జైలుకు పంపిస్తే మౌనంగా భరించారు. ఇబ్బందులకు గురి చేస్తే తట్టుకుని నిలబడ్డారు. వరుస ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకున్నారు. కార్యకర్తల్లో విశ్వాసం సన్నగిల్లకుండా ఉండడానికి పాదయాత్ర చేపట్టారు. సీనియర్లను ఒక తాటిపైకి తీసుకొచ్చారు. అభ్యర్థుల కూర్పు విషయంలోనూ జాగ్రత్త పడ్డారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి దక్షిణాదిన మరొక రాష్ట్రంలో అధికారం దక్కే విధంగా కృషి చేశారు. తెర వెనుక, ముందు రేవంత్ కృషి ఇంతగా కనిపిస్తుంటే.. అది ముమ్మాటికి చంద్రబాబు నాయుడు చొరవ అని టిడిపి నాయకులు అంటున్నారు.
చంద్రబాబు జైలు నుంచి విడుదల కాగానే సింహంలాగా బయటకు వచ్చాడని, ఆయనను చూసేందుకు జనం తండోపతండాలుగా వచ్చారని.. ఆయన రాక వల్లే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందని టిడిపి నాయకులు అంటున్నారు. మరి ఇదే సమయంలో ఎక్కువగా ఉండే హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో 15 నియోజకవర్గాల్లో భారత రాష్ట్ర సమితి నాయకులు గెలిచారు. చంద్రబాబు అరెస్టు ప్రభావం ఒకవేళ తెలంగాణలో బలంగా ఉంటే ఈ నియోజకవర్గాల్లో కచ్చితంగా కాంగ్రెస్ గెలిచి ఉండాలి. మరి అలా కాకుండా బంపర్ మెజారిటీతో భారత రాష్ట్ర సమితి నాయకులు గెలవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? టిడిపికి అంతగా ఓటు బ్యాంకు ఉంటే ఎందుకు పోటీ చేయలేదు అనే విషయాన్ని వారు ఒకసారి అంతర్మథనం చేసుకోవాలి.
2014లో మంచి సీట్లు గెలుచుకున్నప్పటికీ ఓటుకు నోటు కేసు ద్వారా టిడిపి సెల్ఫ్ గోల్ చేసుకుంది. 2018 ఎన్నికల్లో రెండు సీట్లు సాధించినప్పటికీ.. అనతి కాలంలోనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు భారత రాష్ట్ర సమితిలో చేరారు. అప్పటినుంచి రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో… స్థానిక సంస్థల ఎన్నికల్లో.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి ఏమాత్రం ప్రభావం చూపించలేదు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో నోటాతో పోటీపడింది. క్షేత్రస్థాయిలో ప్రజాతీర్పు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు టిడిపి నాయకులు అది తమ ఘనత అని చెప్పుకోవడం విడ్డూరమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.. కాంగ్రెస్ గెలుపులో టిడిపి పాత్ర కొంతవరకు ఉండవచ్చు కానీ.. గెలుపు మొత్తం చంద్రబాబు చాలా వల్లే అని టిడిపి నాయకులు చెప్పడం మాత్రం హాస్యాస్పదం. తెలంగాణలో కాంగ్రెస్ సాధించిన విజయాన్ని తమ ఘనతగా టిడిపి నాయకులు చెప్పుకుంటే మాత్రం అది భవిష్యత్తు కాలంలో ఇక్కడి అధికార పార్టీకి మరింత చేటు తెస్తుంది. అది వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా భారత రాష్ట్ర సమితికి ఆయుధంగా మారుతుంది. అలా ఆయుధంగా మారకముందే కాంగ్రెస్ పార్టీ నాయకులు తేరుకోవాలి. టిడిపి నాయకుల నోళ్లు మూయించాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.