Movement of Maoists: రాష్ట్రంలో మళ్లీ మావోయిస్టుల కదలికలు మొదలవుతున్నాయి. 15 రోజుల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లాలో జనశక్తి నక్సలైట్లు అత్యంత రహస్యంగా సమావేశమయ్యారు. గతంలో పార్టీలో పనిచేసి లొంగిపోయిన నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం. అయితే ఈ సమావేశం వార్తలను పోలీసులు కొట్టి పడేసినప్పటికీ.. ఇంటలిజెన్స్ నివేదిక మాత్రం జనశక్తి సమావేశం నిజమే అని నిర్ధారించినట్లు తెలిసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు మాజీలను పిలిపించుకుని కౌన్సెలింగ్ పేరిట వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మావోయిస్టులు సమావేశం కావడానికి కారణమైన జనశక్తి నేతను కూడా అరెస్ట్ చేశారు. సిరిసిల్ల జిల్లా మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గం కావడం.. ఆయన తరచూ జిల్లా పర్యటనకు వస్తుండడంతో ప్రభుత్వం కూడా ఒక్కసారిగా అప్రమత్తమైంది. మళ్లీ మొగ్గతొడుగుతున్న జనశక్తి పార్టీని ఆదిలోనే అంతం చేసే ప్రణాళిక రూపొందించింది.
-పుట్ట మధు ప్రధాన అనుచరుడికి నక్సల్స్ వార్నింగ్..
పుట్ట మధు ప్రధాన అనుచరుడు పూదరి సత్యనారాయణకు నక్సల్స్ వార్నింగ్ ఇచ్చినట్టుగా ఓ పోస్టర్ వెలిసింది. అతడి ఇంటి ఎదుట గోడకు పోస్టర్ అతికించారు. హైకోర్టు అడ్వకేట్ దంపతులు.. గట్టు వామన రావు, నాగమణి హత్య కేసులో.. స్పాట్ లో సెల్ ఫోన్ మాయం చేసింది పూదరి సత్యనారాయణనే అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో సత్యనారాయణపై రౌడీషీట్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అతడి ఇంటి ఎదుట నక్సల్స్ పేరుతో పోస్టర్ ఉండటం కలకలం రేపుతోంది. దీంతో మంథని నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ నేతల్లో ఆందోళన మొదలైంది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఇప్పటి వరకు ఆ పోస్టర్ నిజమైందా ఎవరైనా ఆకతాయిలు వేశారా అనేది నిర్ధారణ చేయలేదు. మరోవైపు మావోయిస్టు సానుభూతిపరుల కోసం ఆరా తీస్తున్నట్లు తెలిసింది. కాగా పూదరి సత్యనారాయణ స్థానికంగా ఉండకుండా రాజధానికి వెళ్లిపోయినట్లు తెలిసింది.
Also Read: Late Night Partys In Hyderabad: విశ్వనగరం కాదు.. నిషా నగరం.. మత్తులో జోగుతున్న ప్రముఖులు.. టెక్కీలు
-టీబీజీకేఎస్ నేతలకు గుణపాఠం తప్పదు
రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి గుర్తింపు సంఘంగా టీఆర్‌ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ ఎన్నికైంది. గుర్తింపు సంఘం పదవీకాలం పూర్తయినా ఎన్నికలు నిర్వహించకపోకడంతో ఇప్పటికీ ఆ సంఘమే గుర్తింపు యూనియన్‌గా కొనసాగుతోంది. అయితే ఆ సంఘంలో ఫిట్‌స్థాయి నాయకుడి నుంచి సెంట్రల్ కమిటీ నాయకుల వరకు ఆగడాలు పెరిగాయాయి. వారసత్వ ఉద్యోగాల కోసం కార్మికుల నుంచి భారీగా డబ్బులు దండుకుంటున్నారు. తమ పిల్లలకు ఉద్యోగం వస్తుందన్న ఆశతో కార్మికులు కూడా భారీగా ముట్టజెబుతున్నారు.
మెడికల్ అన్‌ఫిట్ దరఖాస్తుల్లో కొన్ని సక్సెస్ అవుతుండగా కొన్ని ఫెయిల్ అవుతున్నాయి. ఒక్కో మెడికల్ అన్‌ఫిట్ కోసం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు టీబీజీకేఎస్ నాయకులు వసూలు చేస్తుండగా, అన్‌ఫిట్ కాని కార్మికులకు తిరిగి డబ్బులు కూడా ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మహిళా కార్మికులపై కూడా టీబీజీకేఎస్ నాయకుల వేధింపులు పెరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ‘గులాబీ గూండాలకు కార్మిక క్షేత్రంలో గుణపాఠం తప్పదు’ అంటూ భారత కమ్యూనిస్టు పార్టీ సింగరేణి కోల్‌బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేశారు. గోదావరిఖని ఏరియా వర్క్‌షాపులో ఫిట్ సెక్రటరీగా ఉన్న స్వామిదాస్ అక్కడ పని చేస్తున్న కార్మికులను, మహిళా కార్మికులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఈ ప్రకటనలో ఆరోపించారు.
కొత్తగూడెం రీజియ¯Œ లోని ఇల్లందులో టీబీజీకేఎస్ ఏరియా నాయకుడు గడ్డం వెంకటేశ్వర్లు, గోదావరిఖని ఏరియా ఆస్పత్రి ఫిట్ సెక్రటరీ, రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రి ఫిట్ సెక్రటరీ కృష్ణ ఆగడాలు మితిమీరుతున్నాయని, బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రిలో టీబీజీకేఎస్ కమిటీ సభ్యుడు కోగిళాల రవీందర్, ఫిట్ సెక్రటరీ హెచ్.సత్యనారాయణ మహిళా కార్మికులతో పాటు కార్మికులను భయాందోళనలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మహిళలపై లైంగిక వేధింపులు పెరిగాయని పేర్కొన్నారు. గోదావరిఖని వర్క్‌షాప్‌లో మహిళా కార్మికురాలు స్వప్నకు న్యాయం చేయాలని, ఆమెకు రక్షణ కలిపించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. టీబీజీకేఎస్ గుండాలకు గతంలో కార్మిక ద్రోహులకు పట్టిన గతే పడుతుందని, కార్మికుల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరించారు.
వరుస ఘటనలతో ఉత్తర తెలంగాణలో మళ్లీ మావోయిస్టులు బలపడుతున్నారన్న ప్రచారానికి బలం చేకూరుతోంది. మరి వీరి కట్టడికి ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.