Chandrababu Statement: ప్రభుత్వం అంటే యంత్రాంగం. ఆ ప్రభుత్వాన్ని నడిపించేది రాజకీయ పార్టీలు. అలా అవకాశం ఇచ్చేది ప్రజలు. అందుకే ప్రజలు ఆశించిన పాలన చేయాలి. అది ప్రభుత్వం కర్తవ్యం కూడా. దానినే గుర్తు చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu). 18 నెలల పాలన పూర్తయిన సందర్భంలో జిల్లా కలెక్టర్లతో పాటు ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు చంద్రబాబు. మనం బాగానే పాలన సాగిస్తున్నాం అని భావిస్తున్నాం కానీ.. ప్రజల నుంచి అది వస్తేనే సత్ఫలితం అని చెబుతున్నారు చంద్రబాబు. తద్వారా యంత్రాంగం పాలనలో వైఫల్యాలను గుర్తు చేస్తున్నారు. వాటిని సరి చేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే వైఫల్యాలు, ప్రజాభిప్రాయం విషయంలో తన గురించి కూడా తాను చెప్పుకొచ్చారు. తాను సైతం మెరుగైన పాలన అందిస్తున్నానని భావిస్తున్నానని.. కానీ ప్రజల నుంచి ఆ స్థాయిలో సంతృప్తి లేదని అర్థం వచ్చేలా మాట్లాడారు చంద్రబాబు. దానిని ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.
సంతృప్తి స్థాయిని అందుకోవాలని..
ప్రభుత్వంతో పాటు యంత్రాంగంలో వైఫల్యాలను ఎప్పటికప్పుడు అధిగమిస్తూ ప్రజల సంతృప్తి స్థాయిని అందుకోవాలి అన్నది చంద్రబాబు ఆలోచన. ఆయన ఏ సమావేశంలో అయినా ఇదే చెబుతూ వస్తున్నారు. ప్రజల సంతృప్తి స్థాయిని అందుకోవాలని అధికారులకు సూచిస్తున్నారు. పాలనలో బ్యూరోక్రసీ వ్యవస్థ ( Bureaucracy system) కీలకం. ఆ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు చంద్రబాబు. అయితే ఎప్పటికప్పుడు ప్రభుత్వ పాలనా తీరును, వైఫల్యాలపై సమీక్ష జరపడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించాలన్నది చంద్రబాబు ఆలోచన. అయితే ఈ విషయంలో ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా మాట్లాడుతున్నారు. తాను చెప్పాల్సింది అధికారులకు నేరుగా చెబుతున్నారు.
అప్పటి పరిస్థితిని గుర్తించి..
అయితే చంద్రబాబు గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. గతంలో అధికారులు చెప్పిన దానికి ఆల్ ఈజ్ వెల్ అన్నట్టు ఉండేవారు. దాని పర్యవసానాలు 2019లో చూశారు చంద్రబాబు. కానీ ఇప్పుడు తన వైఫల్యాలను సైతం సమీక్షిస్తున్నారు. అధికార పార్టీగా.. కూటమిపరంగా వైఫల్యాలను గుర్తిస్తున్నారు. అయితే ఈ వైఫల్య ఫలితాలు అధికారులపై చూపడం లేదు. తనతోపాటు తన పాలకవర్గం నుంచి వచ్చే లోపాలను సైతం చంద్రబాబు ప్రస్తావిస్తున్నారంటే ఆయన ఎంత సీరియస్గా సమీక్ష జరుపుతున్నారో అర్థం అవుతుంది. చంద్రబాబు కామెంట్స్ ను ప్రచారం చేసుకుంటోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆయన పాలనంత వైఫల్యం అని.. ఆయనే రియల్ అయ్యారని ట్రోల్స్ చేస్తోంది. కానీ చంద్రబాబు ఒక వ్యూహం ప్రకారం యంత్రాంగం తో పనిచేయించుకుంటున్నారన్న విషయాన్ని గుర్తించుకోలేకపోతోంది. మరి వైసీపీకి ఇప్పట్లో జ్ఞానోదయం అయ్యేలా లేదు. అదే ఆలోచనలతో ముందుకు వెళితే మాత్రం ఆ పార్టీ ఎప్పుడు పరిణితి చెందదు. పూర్వ వైభవం సాధించలేదు కూడా.