Late Night Partys In Hyderabad: హైదరాబాదు విశ్వ నగరం నిషా నగరంగా మారుతోంది. ప్రముఖులతోపాటు.. టెక్కీలు డ్రగ్స్ మత్తులో జోగుతున్నారు. మాదకద్రవ్యాల వ్యాపారం ముఖ్యంగా ఐటి రంగాన్ని కుదిపేస్తోంది. ఐటి కంపెనీల్లో పని చేసే కొంత మంది పని ఒత్తిడి, మానసికంగా అలసిపోవడంతో ప్రశాంతత కోసం మాదక ద్రవ్యాలు స్వీకరిస్తున్నారు. ఇక సెలబ్రిటీలు.. వారి పిల్లలు ఎంజాయ్, స్టేటస్ కోసం డ్రగ్స్‌కు అలవాటు పడి.. తర్వాత బానిసవుతున్నారు.
వీకెండ్ పార్టీల్లో..
హైదరాబాద్ నగరంలోనూ, శివారుల్లోనూ చిన్నచితకా, బహుళజాతి ఐటి, ఐటి ఆధారిత సాంకేతిక సేవల కంపెనీలు సుమారు 1,183 ఉన్నట్లు తాజా అంచనా. వీటిలో దాదాపు 4.5 లక్షల మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా, పరోక్షంగా పని చేస్తున్నారు.
వారం చివరలో జరిగే విందులూ వినోదాల్లో పాల్గొని మద్యం సేవించడం, పబ్బుల్లో చిందేయడం హైదరాబాద్ మెట్రోపాలిటన్ కల్చర్‌లో చాలా కాలంగా సాగుతోంది. పబ్బుల్లో కొంత మంది డ్రగ్స్ వినియోగిస్తున్నారు. తరచుగా పోలీసులు, టాస్క్ ఫోర్స్ జరుపుతున్న దాడుల్లో డ్రగ్స్ సేవించిన వారు పట్టుబడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇతర ప్రాంతాలకు చెందినవారు.
సైబరాబాద్ ప్రాంతం, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని కంపెనీల్లో ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు చెందిన ఐటీ నిపుణులు, ఉన్నతోద్యోగులు నివసిస్తున్నారు. ఆ ప్రాంతంలో వారి కోసమే అన్నట్లుగా పబ్బులు, క్లబ్బులు, స్టార్ రేంజ్ సౌకర్యాలు ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లు వెలిశాయి. దీంతో ఐటి ఉద్యోగుల్లో కొంత మంది మాదకద్రవ్యాలకు
డ్రగ్ రాకెట్ గుట్టురట్టు కావడంతో…
హైదరాబాద్‌లో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు కావడంతో బహుళజాతి ఐటి కంపెనీలన్నీ ఇప్పటికే హైదరాబాద్‌లోని తమ శాఖల కార్యాలయాలకు అప్రమత్తత ఈ–మెయిల్స్ పంపించినట్లు సమాచారం. ఐటి, ఐటి ఆధారిత సాంకేతిక సేవలందించే కంపెనీలే కాకుండా బీపీవోలు, కేపీవోల్లో పనిచేసే ఉద్యోగుల్లో ఎక్కువ మంది మద్యం, మాదకద్రవ్యాలకు బానిస అవుతున్నట్లు కూడా తెలుస్తోంది.
పని ఒత్తిడి కారణం..
పని ఒత్తిడి, వృత్తిలో పోటీ, కాలపరిమితుల విధింపు తదితర కారణాల వల్ల మాదక ద్రవ్యాల వ్యసనానికి యువతి బానిస అవుతున్నట్లు భావిస్తున్నారు. మత్తుకు అలవాటు పడడానికి వీటితో పాటు పదోన్నతుల కోసం పోటీపడి పని చేయడం, వ్యక్తిగత రుణాలు, వాయిదాల చెల్లింపులు వంటి ఒత్తిళ్లు కూడా యువత వ్యసనానికి బానిస కావడానికి కారణమని అంటున్నారు.
పబ్‌లలో డ్రగ్స్ గబ్బు
హైదరాబాద్ హైటెక్ నగరమే కాదు డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగానికి అడ్డాగా మార్చేస్తున్నారు కొందరు కేటుగాళ్ళు. తాజాగా బంజారాహిల్స్ లో రాడిసన్ హోటల్లోని ఫుడిండ్ అండ్ మింక్ పబ్ లో ప్రముఖుల పిల్లలు టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో దొరికిపోవడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ పబ్ లో డ్రగ్స్ గబ్బు రేపుతున్నాయి. ఇప్పటివరకూ పబ్బుల్లో డ్రగ్స్ దొరుకుతుందని వినడమే ఈసారి రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోయారు మత్తుగాళ్లు.
మొన్న డ్రగ్స్ కేసులో తొలి మరణం.. నేడు పబ్లో రెడ్ హ్యాండెడ్ గా డ్రగ్స్ దొరికిన వైనం..
హైదరాబాద్‌లో నాలుగు రోజుల క్రితం డ్రగ్ కేసులో తొలి మరణం సభవించింది. తాజాగా పబ్‌లో డ్రగ్స్ నేరుగా పట్టుపడడం అందరినీ నివ్వెరపరుస్తోంది. డ్రగ్స్ బానిసలుగా మారిన బడాబాబుల పిల్లలు సమాజానికి సవాల్ విసురుతున్నారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న రాడిసన్ ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో డ్రగ్స్ వినియోగం తాజా సంస్కృతికి అద్దం పడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్స్ చేసేంతవరకు కళ్లు తెరవని బంజారాహిల్స్ పోలీసులు తీరుపై మండిపడుతున్నారు.