
మన దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్ సృష్టించిన మారణహోమం అసాధారణమైంది. ఏ దేశంపైనా ఇంతగా ప్రభావం చూపని మహమ్మారి.. లక్షలాది మందిని ఆసుపత్రుల పాలుచేసింది. వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. ఈ దారుణానికి మెయిన్ రీజన్ డెల్టా వేరియంట్ అని నిపుణులు తేల్చారు. సౌతాఫ్రికా, బ్రెజిల్, బ్రిటన్ లాంటి దేశాల్లో కనుగొన్న మ్యుటెంట్ కన్నా.. భారత్ లో వెలుగు చూసిన ఈ డెల్టా డేంజర్ అని, దీని వల్లనే సెకండ్ వేవ్ వేలాది మందిని బలిగొందని అన్నారు.
కాగా.. ఇప్పుడు ఈ డెల్టా వేరియంట్ డెల్టా ప్లస్ గా మారడం ఒకెత్తయితే.. అది మరింత ప్రమాదకరంగా మారిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై అమెరికా ఆరోగ్య సలహదారు ఫౌచీ ప్రపంచ దేశాలను హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ రకం లంగ్స్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని, వేగంగా దెబ్బతీస్తుందని అంటున్నారు. అందువల్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే డెల్టా ప్లస్ కారణంగా.. దేశంలో తొలి మరణం నమోదు కావడం కలవరానికి గురిచేస్తోంది.
ఈ డెల్టా ప్లస్ కారణంగా.. మధ్యప్రదేశ్ లో ఓ మహిళ చనిపోయింది. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం ఐదు కేసులు గుర్తించగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయినట్టు సర్కారు వెల్లడించింది. మధ్యప్రదేశ్ తోపాటు తమిళనాడు, మహారాష్ట్ర, కేరళలో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 40 కేసులు గుర్తించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో.. సెకండ్ వేవ్ పూర్తిగా సద్దు మణగకముందే.. థర్డ్ వేవ్ భయాలు మొదలయ్యాయి. మూడో వేవ్ అనేది తథ్యం అని చెప్పడానికి ఇదే సూచిక అని, డెల్టా ప్లస్ ద్వారానే మూడో దశ రావొచ్చని మెజారిటీ అభిప్రాయం వినిపిస్తోంది.
ఇదిలాఉంటే.. ఈ వేరియంట్ పై వ్యాక్సిన్ ప్రభావం ఎంత అనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. పరిశోధనలు కొనసాగుతున్నాయి. వ్యాక్సిన్ వల్ల వచ్చే యాంటీ బాడీస్ ను సైతం తట్టుకొని నిలబడే సామర్థ్యం ఈ డెల్టా ప్లస్ కు ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు తుమ్మడం, దగ్గడం ద్వారా ఇతరులకు వ్యాపించే వైరస్.. ఇప్పుడు ఈ వైరస్ ఉన్నవారి గాలి సోకినా.. ఇతరులకు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో.. అందరూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. తప్పకుండా అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని చెబుతున్నారు. దీని తీవ్రత ఎంత అనేది రాబోయే రెండు నెలల్లో స్పష్టం కావొచ్చని అంచనా వేస్తున్నారు. శుభ్రత పాటించడం.. భౌతిక దూరం అనుసరించడం.. శానిటైజ్ చేసుకోవడం ద్వారా వైరస్ కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.