Manmohan Singh : నిన్న అంటే డిసెంబర్ 26 దేశం చాలా చేదు వార్తను అందుకుంది. దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. 2004 నుంచి 2014 వరకు దేశ ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ నిన్న అర్థరాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మన్మోహన్ సింగ్ కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన మరణానంతరం దేశ ప్రధాని నరేంద్ర మోదీ, దేశాధ్యక్షురాలు ద్రౌపది ముర్ము తదితర ప్రముఖులు సంతాపం తెలిపారు. అయితే ఎకనామిక్స్ కెరీర్‌గా మార్చుకున్న దేశ మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ తండ్రి ఆయనను డాక్టర్ గా చూడాలని కోరుకున్నారట. ఆకలితో అలమటిస్తూనే కష్టపడి ఇంత విజయాన్ని ఎలా సాధించాడు? ఆయన కూతురు చెప్పిన కథ ఏంటో తెలుసుకుందాం.
మన్మోహన్ సింగ్ డాక్టర్ కావాలని తండ్రి కోరిక
ప్రతి బిడ్డ విషయంలో వారి తల్లిదండ్రులకు ఓ కల ఉంటుంది. తన కొడుకు తన జీవితంలో ఏదో ఒకటి చదువుకోవాలి. ఉన్నతంగా ఎదగాలని ప్రతి తండ్రి కోరుకుంటారు. దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తండ్రి గుర్ముఖ్ సింగ్‌కు కూడా తన కొడుకు డాక్టర్ కావాలనే కల ఉండేది. అంతే కాదు తండ్రి పట్టుబట్టి మన్మోహన్ సింగ్ కూడా మెడికల్ కోర్సులో అడ్మిషన్ తీసుకున్నాడు. కానీ మన్మోహన్ సింగ్ మనసు మాత్రం ఎక్కడో ఉంది. అతనికి మెడికల్, సైన్స్ చదువులు అస్సలు నచ్చేవి కావు. ఈ విషయాన్ని స్వయంగా మన్మోహన్ సింగ్ కుమార్తె దమన్ సింగ్ తెలిపారు.
2014లో దమన్ సింగ్ ‘స్ట్రిక్ట్లీ పర్సనల్: మన్మోహన్ అండ్ గురుశరణ్’ అనే పుస్తకాన్ని రాశారు. తన తండ్రి వైద్య విద్యను విడిచిపెట్టి ఆర్థికశాస్త్రం వైపు ఎలా మళ్లాడో ఈ పుస్తకంలో పేర్కొన్నారు. దామన్ ఇలా రాశారు, “తన తండ్రి అతను డాక్టర్ కావాలని కోరుకున్నాడు కాబట్టి, అతను (మన్మోహన్ సింగ్) రెండేళ్ళ F.Sc. ప్రోగ్రామ్‌లో చేరారు. అది అతనికి తదుపరి వైద్య విద్యను అభ్యసించే అవకాశాన్ని కల్పిస్తుంది. కొన్ని తర్వాత అతను చదువు మానేశాడు. అతను డాక్టర్ కావాలనే ఆసక్తిని కూడా కోల్పోయారు.’’ అని పేర్కొన్నారు.
పేదరికంలో ఆకలితో బాల్యం
మన్మోహన్ సింగ్ కుమార్తె దమన్ సింగ్ కూడా తన తండ్రి బాల్యం ఎలా ఉండేదో ‘స్ట్రిక్ట్లీ పర్సనల్: మన్మోహన్ అండ్ గురుశరణ్’ అనే పుస్తకంలో ప్రస్తావించారు. మన్మోహన్ సింగ్ చాలా పేద కుటుంబానికి చెందినవారు. తన ఇంటి ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. చాలాసార్లు ఆకలితో బతకాల్సి వచ్చిందని మన్మోహన్ కుమార్తె ఆవేదనను వ్యక్తం చేశారు.