మూవీ ఆర్టిస్ట్స్ లు అంటే సహజంగానే జనంలో మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే వాళ్ళ అసోసియేషన్ (మా) ఎన్నికలు అంటే జనం రెగ్యులర్ ఎన్నికల పై చూపించిన ఆసక్తిని చూపిస్తున్నారు. దానికి తగ్గట్టు మీడియా కూడా ‘మా’ ఎన్నికల పై లేనిపోని హడావుడి క్రియేట్ చేసి మొత్తానికి కాంట్రవర్సీ కంటెంట్ కోసం తాపత్రయ పడుతుంది. ఇక ఈ మధ్యలో అధ్యక్ష పదవి కోసం పోటీకి దిగిన ‘మంచు విష్ణు – ప్రకాష్ రాజ్‘ మధ్య రోజురోజుకు మాటల యుద్ధం జరుగుతుంది. మొత్తానికి పోరు రసవత్తరంగా మారింది.
అయితే, ఈ ఉదయం నుంచి ప్రకాష్ రాజ్ ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ. మంచు విష్ణు ప్యానెల్ పోస్టల్ బ్యాలెట్‌ను దుర్వినియోగం చేస్తోందని. మరి ఈ ఆరోపణల్లో నిజం ఎంత ఉందో తెలియదు గానీ, ప్రకాష్ రాజ్ మాత్రం ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో పోస్టల్ బ్యాలెట్ వివాదం పై ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణమోహన్ స్పందించక తప్పలేదు.
కృష్ణమోహన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కేవలం కరోనా కారణంగానే మొదటి సారి పోస్టల్ బ్యాలెట్ పెట్టాల్సి వచ్చింది. అయితే, ‘మా’లో 60 ఏళ్లు పై బడిన సభ్యులు మొత్తం 125 మంది వరకు ఉన్నారు. కానీ ఇప్పటివరకు 60 మంది సభ్యులు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ కావాలని కోరారు. ఆ 60 మందికి పోస్టల్ బ్యాలెట్ పేపర్లు పంపిస్తున్నాము. అయితే పోస్టల్ బ్యాలెట్ పేపర్ కు నామినల్ గా రూ.500 చెల్లించాలి ఉంది.
కానీ, డబ్బు చెల్లింపు పై సీనియర్ సభ్యులకు సరైన అవగాహన లేదని వాళ్లే చెప్పడం జరిగింది. దాంతో ఆ ప్రక్రియ కోసం మంచు విష్ణుకు ఆ సీనియర్ సభ్యులు ఫోన్ చేశారట. దీంతో మంచు విష్ణుకి సంబంధించిన వ్యక్తి వచ్చి ఆ మొత్తం డబ్బు చెల్లించడం జరిగింది. కానీ, ఒకే వ్యక్తి డబ్బు చెల్లించటం అనేది నిబంధనలకు విరుద్ధం కాబట్టి.. ఆ డబ్బును తిరిగి ఇచ్చేశాం. ఇక ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో పోస్టల్ బ్యాలెట్ ను రద్దు చేసే ఆలోచన గానీ, అవకాశం గానీ లేదు’ అని ఆయన చెప్పుకొచ్చారు.
ఇక ప్రకాశ్ రాజ్ వెర్షన్ కి వచ్చేసి.. ఆయన మాటల్లోనే.. ‘‘60 ఏళ్లు పైబడిన నటీనటులు పోస్టల్ బ్యాలెట్ కు అర్హులు. అయితే అలాంటి వారిని అడ్డు పెట్టుకుని ఏజెంట్ల ద్వారా పోస్టల్ బ్యాలెట్ కుట్ర చేస్తున్నారని, అయినా ఆగంతుకులతో ‘మా’ ఎన్నికలు నిర్వహిస్తామా ? చెప్పండి’ అంటూ ప్రకాశ్‌రాజ్ అన్నారు.
