పుదుకోట్లై జిల్లాలోని పొన్నమరావతి సమీపంలోని మూలక్కుడి గ్రామానికి చెందిన నాగరాజన్ (40) దాదాపు ఇరవై ఒక్క ఏళ్ల క్రితం కుటుంబాన్ని పోషించుకునేందకు కోయంబత్తూర్ కు వెళ్లి అక్కడ ఓ కిరాణా దుకాణంలో పని చేసేవాడు. అప్పుడు కేరళకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. తన తోబుట్టువుల పెళ్లి తరువాత వివాహం చేసుకుందామని ఆమెను మూలక్కుడికి తీసుకొచ్చాడు.
విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, బంధువులు కారులో వచ్చి బలవంతంగా తీసుకెళ్లారు. దీంతో ఎప్పటికైనా తిరిగి వస్తుందనే ఆశతో నాగరాజన్ రోడ్డుపైనే ఉండేవాడు. ఒక వేళ వస్తే ఎటైనా వెళ్లిపోతోందనే నెపంతో అక్కడే స్థావరం ఏర్పాటు చేసుకున్నాడు. కొన్నాళ్లకు మతిస్థిమితం తప్పింది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా ఊరికి దూరంగా రెండు కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన చిన్న బండ రాయిపై ఉండేవాడు.
అక్కడే చిన్న బండపై ఒక గుడిసె ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నాడు. అతడికి తల్లి నాగాయి ఆహారం ఇచ్చి వెళ్తుంటుంది. ఎవరితోను మాట్లాడకుండా అక్కడే నిరీక్షిస్తున్న నాగరాజన్ ఎంత కాలమైనా తన ప్రియురాలు వస్తుందని ఆశతో ఉన్నాడు. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది చికిత్స కోసం అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు.