https://oktelugu.com/

గేలి చేసిన వాళ్లకు చెంపపెట్టులా ‘గోల్’ సాధించిన ‘రజినీ’

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో గల ఒక మారుమూల పల్లెటూరి పిల్ల ఆమె.. హాకీ అంటే ప్రాణం.. ఆ క్రీడ కోసం షార్ట్ డ్రెస్సులు చిన్నప్పుడు వేసుకునేది.. ‘ఏమిటీ డ్రెస్సు’ అని ఆకతాయిలు అనేవారు . కానీ ఆమె కుంగిపోలేదు. ఆ డ్రెస్సులు వేయడం మారలేదు. కానీ అదే పల్లెటూరి పిల్లగా 18 దేశాల్లో జరిగిన హాకీ పోటీలకు దక్షిణ భారత దేశం నుంచి ప్రాతినిధ్యం వహించింది. దక్షిణాది నుంచి ఇలా ఎంపికైన ఏకైక మహిళ క్రీడాకారిణి […]

Written By:
  • NARESH
  • , Updated On : August 11, 2021 / 05:15 PM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో గల ఒక మారుమూల పల్లెటూరి పిల్ల ఆమె.. హాకీ అంటే ప్రాణం.. ఆ క్రీడ కోసం షార్ట్ డ్రెస్సులు చిన్నప్పుడు వేసుకునేది.. ‘ఏమిటీ డ్రెస్సు’ అని ఆకతాయిలు అనేవారు . కానీ ఆమె కుంగిపోలేదు. ఆ డ్రెస్సులు వేయడం మారలేదు. కానీ అదే పల్లెటూరి పిల్లగా 18 దేశాల్లో జరిగిన హాకీ పోటీలకు దక్షిణ భారత దేశం నుంచి ప్రాతినిధ్యం వహించింది. దక్షిణాది నుంచి ఇలా ఎంపికైన ఏకైక మహిళ క్రీడాకారిణి ఈమెనే. ఆమెను ఎగతాళి చేసిన వారే ఇప్పుడు ‘రజినీ’ని మా ఊరి పిల్లేనబ్బా అంటూ కాలర్ ఎగరేసేలా చేసింది.. ఆ ఊరికి పేరు తెచ్చిన భారత హాకీ మహిళా జట్టు గోల్ కీపర్ ‘రజినీ’ విజయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం..

    అప్పటికే ఆ కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు.. ఆ తల్లిని గేలిచేశారు. ఎందుకు నీ బిడ్డను హాకీలో శిక్షణ కోసం పంపిస్తున్నావన్నారు.. శిక్షణ కోసం పొట్టి డ్రెస్సులు వేసుకొని వెళుతుంటే ఊరోళ్లంతా ఎగతాళి చేశారు. వారి మాటలకు ఆమె కృంగిపోలేదు. మరింత పట్టుదల పెంచాయి. ఒలింపిక్స్ లో దేశం నుంచి ప్రాతినిధ్యం వహించి ఆమె పల్లెకు గుర్తింపు తెచ్చింది. హేళన చేసిన వారి నుంచే ఇప్పుడు అభినందనలు అందుకుంటోంది.

    పట్టుదలకు ప్రోత్సాహం తోడైతే పేదరికం అడ్డు కాదని భారత మహిళా హాకీ జట్టు క్రీడాకారినణి ‘రజినీ’ నిరూపించింది. అమ్మ తోడ్పాటు, నాన్న కష్టం, శిక్షకుల ప్రోత్సాహం తో అడవి పల్లె నుంచి ఆమె ప్రతిభ అంతర్జాతీయ క్రీడా యవనికపై సుస్థిరం చేసుకునే దాకా చేరింది.

    చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళెం మండలం ఎనుమాములవారి పల్లె గ్రామం. ఇది మారుమూల అటవీ సరిహద్దుల్లో ఉంటుంది. తండ్రి రమణాచారి వడ్రంగి వ్యాపారం చేస్తుంటాడు. అమ్మ తులసి పశువుల కాపరిగా చేస్తుంటుంది. వీరికి ముగ్గుర సంతానం.. ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. ఇందులో రెండో అమ్మాయి రజినీ. ఐదో తరగతి వరకు పచ్చారవారిపల్లెలోనే చదివింది. ఆరోతరగతి నుంచి ఆరు కిలోమీటర్లు దూరం నడిచి చదువుకుంది. వీళ్ల తల్లిని ఆడపిల్లల తల్లి అంటూ ఆటపట్టించేవారు. అయినా ఎవరిని ఏమీ అనలేకపోయేది.

    హైస్కూల్ లో ఉండగా పీఈటీ మాస్టర్ వెంకటరాజు ఆటలపోటీల్లో చురుకుగా పాల్గొంటున్న రజినీ ఆసక్తిని గమనించాడు. మెళకువలు నేర్పాడు. ఆయన సారథ్యంలోనే తొలి శిక్షణ పొందింది రజినీ. ఆమె పట్టుదల చూసి అమ్మానాన్న ప్రోత్సహించారు. ఆమెలోని క్రీడాకారిణికి ఊపిరి పోయడానికి అప్పులు చేసి మరీ కోచింగ్ ఇప్పించి క్యాంపులకు పంపించారు. పేదరికంలో ఉన్నా కూడా తల్లిదండ్రులు భరించారు. ఆ పట్టుదల రజినీలో కసిని పెంచాయి. హాకీలో బాగా ఆడేలా చేశాయి. 2004లో ఆరోతరగతిలోనే పుత్తూరులో జరిగిన జోనల్స్ లో రన్నర్ నిలిచింది. 2005లో తిరుపతిలో జరిగిన ఇంటర్ జోనల్స్ లో ప్రాతినిధ్యం వహించింది. 2005లో పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ లో జరిగిన పోటీలకు ఎంపికై సత్తా చాటింది.

    2009లో మొదటి అంతర్జాతీయ మ్యాచ్ లో గోల్ కీపర్ గా ఆడింది రజినీ.ఒలింపిక్ హాకీ జట్టుకు గోల్ కీపర్ గా ప్రాతినిధ్యం దక్కింది. అలా రజినీ పల్లె ప్రపంచ క్రీడా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒలంపిక్స్‌ హకీలో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. వారి అమ్మానాన్నలకు ఊరి వారి నుంచి అభినందనల వర్షం కురిసింది.

    2010లో చైనా, న్యూజిలాండ్, కొరియా, అర్జెంటీనాలతో అంతర్జాతీయ మ్యాచుల్లో రజినీ గోల్ కీపర్ గా సత్తా చాటింది. 2011లో ఆస్ట్రియా పోటీల్లో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించింది. 2012లో జనవరిలో ఢిల్లీలో జరిగిన హాకీలో చాంపియన్ గా నిలవడంలో రజినీ కీలక పాత్ర పోసించింది. 2014లోనూ స్వర్ణ పతకం గెలిచింది. 2016లో ఒలింపిక్ అర్హత సాధించింది. తాజాగా టోక్యో ఒలింపిక్స్ లోనూ భారత మహిళా హాకీ జట్టు సెమీఫైనల్ వరకూ వెళ్లడంలో రజినీ ప్రతిభ జట్టుకు ఉపయోగపడింది. అందుకే ఈ క్రీడాకారిణిని ఏపీ ప్రభుత్వం నగదు బహుమతి అందజేసి తాజాగా ఘనంగా సత్కరించింది.

    ఒలింపిక్స్‌లో విశేష ప్రతిభ చూపిన ఏపీకి చెందిన అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి ఇ. రజనీకి ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు. రూ. 25లక్షల నగదు ఇవ్వడమే కాకుండా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో ఇవాళ సీఎంను తన తల్లిదండ్రులతో కలిసి రజనీ కలుసుకున్నారు. టోక్యో ఒలిపింక్స్‌లో కాంస్యపతక పోరువరకూ కూడా భారత మహిళల జట్టు దూసుకెళ్లింది. జట్టు విజయాల్లో రజనీ కీలక పాత్ర పోషించారు. రజనీని ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించారు. జ్ఞాపికను బహూకరించారు. గత ప్రభుత్వంలో రజనీకి ప్రకటించి, పెండింగ్‌లో ఉంచిన బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. తిరుపతిలో 1000 గజాల నివాస స్ధలం, నెలకు రూ. 40 వేల చొప్పున ఇన్సెంటివ్‌లు కూడా ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.

    రజనీ స్వగ్రామం చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒలంపిక్స్‌ హకీలో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. 2016లో జరిగిన రియో ఒలంపిక్స్‌తో పాటు టోక్యో ఒలంపిక్స్‌ 2020లో కూడా పాల్గొన్న క్రీడాకారిణి ఆమె. 110 అంతర్జాతీయ హకీ మ్యాచ్‌లలో పాల్గొని ప్రతిభ కనపరిచారు.

    ఈ కార్యక్రమంలో పాల్గొన్న రజనీ కుటుంబ సభ్యులు, పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు, క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి, రెవెన్యూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ, శాప్‌ వీసీ అండ్‌ ఎండీ ఎన్‌.ప్రభాకర్‌ రెడ్డి, శాప్‌ అధికారులు రామకృష్ణ, జూన్‌ గ్యాలట్, రాజశేఖర్, రాజు.

    ఇలా రజినీ ప్రతిభ ఎల్లలు దాటింది. ఆ ఆడపిల్లను కన్న తల్లిదండ్రుల కలను నెరవేర్చింది. ఆ పేదింట క్రీడా కుసుమం విరబూసేలా చేసింది. ఇన్నాళ్లకు ఆమె ప్రతిభకు దగ్గ ఫలితం దక్కినట్టైంది. మున్ముందు రజినీ మరెన్నీ విజయాలు సాధించాలని మనసారా కోరుకుందాం..