కార్ఖానా బస్తీకి చెందిన కిషోర్ వృత్తి రీత్యా వడ్రంగి. వయసు 46 ఏళ్లు. వయసు మీద పడుతున్నా పెళ్లి కావడం లేదు. దీంతో అతడిలో అలజడి కలిగింది. ఇక తనకు వివాహం కావడం గగనమే అనుకుని తాగుడుకు బానిసయ్యాడు. విచ్చలవిడిగా మద్యం తాగుతుండడంతో ఇటీవల పచ్చకామెర్ల వ్యాధి కూడా సోకింది. దీంతో ఇక తన బతుకు వ్యర్థమని భావించాడు. ఎలాగైనా ఆత్మహత్య చేసుకోవాలని తలపించాడు. అనుకున్నదే తడవుగా తన మనసులోని మాట ఆచరణలో పెట్టాలని ఉదయమే ఇంటి నుంచి నడుచుకుంటూ బయటకు వెళ్లాడు.
హనుమాన్ దేవాలయం చేరుకోగానే అక్కడ ప్రాంతాన్ని పరిశీలించాడు. ఎవరు లేకపోవడంతో తన పని కానివ్వాలనుకున్నాడు. అయితే గేటు వేసి ఉండడంతో ప్రహరీ దూకి లోనికి ప్రవేశించాడు. దేవుడి ముందే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గుడిలో ఎవరో ఆత్మహత్య చేసుకున్నారనే సమాచారంతో తమ్ముడు వెళ్లి చూసి ఆశ్చర్యపోయాడు. చనిపోయింది తన అన్నగా గుర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు చేస్తున్నారు.
మరో వైపు రెండు రోజుల క్రితమే ఉత్తర ప్రదేశ్ లో కూడా ఓ యువతి దేవాలయంలోనే ఆత్మహత్య చేసుకుంది. ఆమె భక్తితో గర్భగుడిలోకి వెళ్లి ముందుగా గొంతు కోసుకుని కారుతున్న రక్తంతోనే గుడిలోని గంటలకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇలా దేవాలయాల్లో భక్తులు ఆత్మహత్యలకు పాల్పడడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. భక్తితో కానీ భయంతోనైనా ఇలా గుళ్లలో ఆత్మహత్య చేసుకోవడంపై భక్తుల్లో కూడా భయం కలుగుతోంది.