
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ ముచ్చటగా మూడోసారి ఈరోజు పశ్చిమ బెంగాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే కాలంలో చేసిన సీఎం పదవికి రాజీనామా చేసిన ఆమె గవర్నర్ జగదీప్ ధన్కర్ ను కలిశారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించే వరకు కేర్ టేకర్ గా వ్యహరించనున్నారు.
తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ గట్టి పోటీనిచ్చినా కూడా మమతా బెనర్జీ తట్టుకొని నిలబడ్డారు. దాదాపు 213 అసెంబ్లీ స్థానాల్లో టీఎంసీ విజయం సాధించగా.. 77 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు నమోదు చేసింది. ఎన్నికల్లో విజయం అనంతరం సోమవారం మమతా బెనర్జీ బీజేపీపై జాతీయ పోరుకు శ్రీకారం చుడుతున్నట్టు పేర్కొన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అంతకంటే ముందు కరోనా కట్టడికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ ఈరోజు ఉదయం 10.45 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమె ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ కొట్టారు. ఈరోజు ఆమె ఒక్కరే ప్రమాణం స్వీకారం చేస్తారు. కేబినెట్ మాత్రం మే 6 లేదా మే 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక తన ప్రమాణ స్వీకారానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ లకు ఆహ్వానం అందింది. మమతను గెలిపించిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహా మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్య, లెఫ్ట్ ఫ్రంట్ నేత విమనా బోస్ లను కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు.
రెండు సార్లు సీఎంగా చేసిన మమతా బెనర్జీ ఈసారి మాత్రం నందిగ్రామ్ లో ఓడిపోయారు. కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అయితే 6 నెలల ల్లోపు రాజ్యాంగం ప్రకారం ఎమ్మెల్యేగా మమత ఎన్నిక కావాల్సి ఉంటుంది. లేదంటే ఆమె బెంగాల్ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. బెంగాల్ లో రెండు సీట్లకు ఎన్నిక నిర్వహించలేదు. అందులో ఒకదాంట్లో మమత పోటీచేసి గెలవనున్నారు.
ఇదివరకు 2011 మే 20న, రెండోసారి 2016 మే 27న బెంగాల్ సీఎంగా మమత బెనర్జీ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇది మూడోసారి.