
Mahasena Rajesh: ముందుగా ప్రకటించినట్టుగానే మహాసేన రాజేశ్ టీడీపీ కండువా కప్పుకున్నారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ పాలనను ఎండగట్టారు. కానీ అసలు విషయం ఇప్పుడే తెరమీదకి వచ్చింది. టీడీపీలోకి మహాసేన రాజేష్ బేషరతుగా చేరారా ? లేదా ఎమ్మెల్యే టికెట్ కోసం చేరారా ? అన్న చర్చ ఇప్పుడు ప్రధానాంశంగా మారింది.
టీడీపీతో కంటే జనసేనతోనే మహాసేన రాజేశ్ సంబంధాలు కొనసాగించారు. పలు జనసేన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ చివరి నిమిషంలో టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. అందుకు గల కారణాలు వెల్లడించారు. అనుకున్నట్టుగానే టీడీపీలో చేరిపోయారు. సామర్లకోటలో టీడీపీ దళిత సామాజికవర్గంతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జగన్ పై విమర్శలు చేశారు.
2019 ఎన్నికల సమయంలో చంద్రబాబును జగన్ దళిత ద్రోహిగా చిత్రీకరించారని చెప్పారు. జగన్ మాటలు విని చంద్రబాబును అపార్థం చేసుకున్నట్టు రాజేష్ తెలిపారు. నిజమైన దళిత ద్రోహి ఎవరో తొందరగానే గ్రహించామని చెప్పారు. చంద్రబాబు దళితుల కోసం 27 సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. జగన్ వాటిని రద్దు చేశారని ఆరోపించారు. 2019లో తప్పు చేయకపోతే అమరావతి నిర్మాణం పూర్తీ అయ్యేదని తెలిపారు. చీకటి వచ్చాకే వెలుగు విలువ తెలుస్తుందని రాజేశ్ అన్నారు. జగన్ తుగ్లక్ పాలన చూశాక.. చంద్రబాబుది రామరాజ్యమని అర్థమవుతోందని అన్నారు.

మహాసేన రాజేశ్ టీడీపీలోకి చేరిపోయారు. ఇక ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తారు. జగన్ కు వ్యతిరేకంగా గళం విప్పుతారు. ఇదంతా తెలిసిన విషయమే. ఇక్కడ తెలియని విషయం ఏంటంటే.. జనసేనలో చేరాల్సిన మహాసేన రాజేశ్ టీడీపీలో ఎందుకు చేరారు ? టీడీపీ నుంచి ఎలాంటి హామీ లభించింది ?. ఇవి పొలిటికల్ సర్కిల్స్ వినిపిస్తున్న గుసగుసలు. చంద్రబాబు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనే ఆశతో రాజేశ్ టీడీపీలోకి చేరినట్టు కనిపిస్తోంది. కానీ టీడీపీలోని సీనియర్లను కాదని కేవలం సోషల్ మీడియా ద్వార ఫేమస్ అయిన రాజేశ్ కు టికెట్ ఇస్తారా అన్నదే అసలు ప్రశ్న. అలాంటి ప్రయోగం చంద్రబాబు చేయగలరా అన్నదే టీడీపీ నేతలను వేధిస్తోన్న ప్రశ్న. ఎమ్మెల్యే టికెట్ కాకపోతే కనీసం.. ఏదైన కార్పొరేషన్ పదవి హామీ అయినా ఇచ్చి ఉంటారని ప్రచారం జరుగుతోంది. లేదంటే మహాసేన రాజేశ్ టీడీపీలోకి చేరేవారు కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దళిత వర్గంలో అంతో ఇంతో క్రేజ్ ఉన్న రాజేశ్ ను టీడీపీలోకి చేర్చుకోవడం ద్వార.. తాము దళితుల వైపు ఉన్నామని చెప్పే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని చెప్పవచ్చు.