మహారాష్ట్రలో మహమ్మారి ఉగ్రరూపం

కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ రూపంలో మరోసారి దేశాన్ని పట్టిపీడిస్తోంది. కరోనా ఉధృతి ఇక ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. సెకండ్‌ వేవ్‌లోనూ పాజిటివ్‌ రేట్‌ భారీగా పెరుగుతోంది. అదేస్థాయిలో మరణాలూ కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 11,13,966 మందికి కోవిడ్‌ టెస్టులు చేస్తే.. 81,466 కొత్త కేసులు వెలుగుచూశాయి. సుమారు ఆరు నెలల తర్వాత ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. వీటితోకలిపి మొత్తం కేసుల సంఖ్య 1,23,03,131కు చేరింది. కాగా.. […]

Written By: Srinivas, Updated On : April 2, 2021 12:50 pm
Follow us on


కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ రూపంలో మరోసారి దేశాన్ని పట్టిపీడిస్తోంది. కరోనా ఉధృతి ఇక ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. సెకండ్‌ వేవ్‌లోనూ పాజిటివ్‌ రేట్‌ భారీగా పెరుగుతోంది. అదేస్థాయిలో మరణాలూ కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 11,13,966 మందికి కోవిడ్‌ టెస్టులు చేస్తే.. 81,466 కొత్త కేసులు వెలుగుచూశాయి. సుమారు ఆరు నెలల తర్వాత ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. వీటితోకలిపి మొత్తం కేసుల సంఖ్య 1,23,03,131కు చేరింది.

కాగా.. గడిచిన 24 గంటల్లో 469 మంది మృతిచెందారు. దీంతో మొత్తంగా 1,63,396కి చేరింది మృతుల సంఖ్య. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో.. క్రియాశీల కేసుల్లో భారీ వృద్ధి కనిపిస్తోంది. ప్రస్తుతం కరోనా బాధితుల సంఖ్య 6,14,696కి చేరింది. క్రియాశీల రేటు 4.78 శాతానికి పెరిగింది. ఫిబ్రవరిలో 1.25 శాతానికి తగ్గిన క్రియాశీల రేటులో ఇప్పుడు భారీ పెరుగుదల కనిపిస్తుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కోవిడ్‌ నుంచి కోలుకునే వారి గణాంకాలు కూడా కాస్త ఊరటనిస్తున్న మాట వాస్తవం. నిన్న ఒక్కరోజే 50,356 మంది వైరస్‌ బారి నుంచి బయటపడ్డారు. మొత్తం రికవరీలు 1.15 కోట్లు దాటగా.. ఆ రేటు 93.89 శాతానికి తగ్గింది.

మరోవైపు.. మహారాష్ట్రలో డేంజర్‌‌ బెల్స్‌ మోగుతున్నాయి. ఈ రాష్ట్రాన్ని కరోనా పట్టి పీడిస్తోంది. దేశవ్యాప్తంగా బయటపడుతున్న కేసుల్లో సగానికి పైగా ఈ ఒక్క రాష్ట్రం నుంచి నమోదు అవుతుండడం ఆందోళనకర అంశం. నిన్న 43,183 మందికి పాజిటివ్‌ తేలగా.. 249 మంది మరణించారు. మొత్తంగా 28 లక్షల మందికి పైగా కరోనా సోకగా.. 24 లక్షల మందికి పైగా కోలుకున్నారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 3,67,897 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి.

ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. నిన్నటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి టీకా అందిస్తున్నారు. ఏప్రిల్‌ ఒకటిన కేంద్రం 36,71,242 మందికి టీకా డోసులను పంపిణీ చేసింది. మొత్తంగా 6.87 కోట్ల మందికి టీకాలు అందాయి. మరోవైపు.. కరోనా కేసులు రోజురోజుకూ తీవ్రం అవుతుండడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కేంద్ర, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలు హెచ్చరిస్తున్నాయి. తప్పనిసరిగా చేతులను శానిటైజ్‌ చేసుకోవాలని.. ఫిజికల్‌ డిస్టెన్స్‌ పాటించాలని.. మాస్క్‌లు విధిగా ధరించాలని సూచిస్తున్నాయి. అంతేకాదు.. ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తున్నాయి కూడా.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్