కోవిడ్ సెకండ్ వేవ్ తన ప్రభావాన్ని కొంత మేర తగ్గించినట్లుంది. కేసుల సంఖ్య మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. ఆందోళన బాట నుంచి బాధితులు సాంత్వన పొందుతున్నారు. తమ ప్రాణాలు ఎక్కడ గాల్లో కలుస్తాయోనని భయపడిన ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు. దేశంలో రోజువారీ కేసులు తగ్గుతున్నాయి. సెకండ్ వేవ్ ప్రభావాన్ని తీవ్రంగా ఎదుర్కొన్న మహారాష్ర్టలో కేసులు తగ్గడంతో సెకండ్ వేవ్ ప్రభావం మారిపోయిందని చెబుతున్నారు. మే ద్వితీయార్థంలో కరోనా తగ్గిపోతుందని శాస్ర్తవేత్తలు చెప్పిన విషయం నిజమనేని తేలుతోంది.
అతలాకుతలం అయిన మహారాష్ర్ట
సెకండ్ వేవ్ ప్రభావంతో మహారాష్ర్ట అతలాకుతలం అయింది. మార్చిలో ఇక్కడ కేసుల సంఖ్య మరీ భయపెట్టాయి. రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం మహారాష్ర్టలో యాక్టివ్ కేసుల సంఖ్య సుమారు 4.19 లక్షలు. రోజువారీగా నమోదవుతున్న కేసుల కంటే రికవరీల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో కోవిడ్ భారం తగ్గిందనే విషయం తెలుస్తోంది. ముంబైలో ఒక రోజులో 953 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ వెయ్యికి తక్కువ కేసులు నమోదు కావడం ఈ సీజన్ లో ఇదే తొలిసారి.
మహారాష్ర్టలో పతాక స్థాయికి..
మహారాష్ర్టలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో మార్చి, ఏప్రిల్ నెలల్లో కేసులు పతాక స్థాయికి చేరుకున్నాయి ఆందోళన కర పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రజలు అల్లాడారు. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. దీంతో సెకండ్ వేవ్ ప్రభావం ఎప్పుడు తగ్గుతుందోనని గుండెల మీద చేతులు వేసుకుని కంగారు పడ్డారు. ప్రస్తుతం కరోనా కేసులు శాంతించడంతో కాస్త ఉపశమనం పొందుతున్నారు.
దేశంలోనూ..
కరోనా ప్రభావం దేశమంతా క్రమంగా తగ్గుతూ వస్తోంది. అత్యంత భారీగా కేసులు నమోదయిన మహారాష్ర్టలో పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. దీంతో అటు ప్రజాప్రతినిధులు, ఇటు ప్రజలు కరోనా నెమ్మదించడంపై భయాందోళన వీడుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు రావద్దని వేడుకుంటున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మరీ బతుకు ఈడ్చిన భారాన్ని గుర్తు చేసుకుంటున్నారు.