https://oktelugu.com/

Maharashtra: ప్రాణం తీసిన సోషల్ మీడియా రీల్స్ పిచ్చి..

Maharashtra: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలోని దత్ గుడి ఉంది. పర్యాటకపరంగా ఈ ప్రాంతం చాలా ప్రసిద్ధి. చుట్టూ లోయలు, గుట్టలు, పచ్చని చెట్లతో అలరారుతూ ఉంటుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 18, 2024 6:14 pm
    23-year-old woman dies while filming reel

    23-year-old woman dies while filming reel

    Follow us on

    Maharashtra: ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు.. క్షణక్షణం దాని వెంటే పరుగులు. ఫేస్ బుక్ లో ఏముంది? ఇన్ స్టా గ్రామ్ లో ఏం కనిపిస్తోంది? ట్విట్టర్ లో ఏం దర్శనమిస్తోంది? వాట్సాప్ లో ఏం మేసేజ్ వచ్చింది? ఇలానే సాగిపోతోంది ప్రతీ ఒక్కరి సోషల్ జీవితం. చాలామంది అందులో మునిగి తేలుతున్నారు కాబట్టే సోషల్ మీడియా వినియోగం తారాస్థాయికి చేరుతోంది. ఇందులో దండిగా సంపాదించుకునేందుకు అవకాశం ఉండడంతో చాలామంది ఫేమస్ అయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అలా ఫేమస్ అయే క్రమంలో కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. కొన్నిసార్లు వాళ్ల చేష్టలు ప్రాణాల మీదికి తెస్తున్నాయి. ఇలా ఓ యువతి సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు.. రీల్స్ చేయాలని భావించింది. ఇందులో భాగంగా కారు ఎక్కి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.. చూస్తుండగానే కారు లోయలో పడి ప్రాణాలు కోల్పోయింది.

    మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలోని దత్ గుడి ఉంది. పర్యాటకపరంగా ఈ ప్రాంతం చాలా ప్రసిద్ధి. చుట్టూ లోయలు, గుట్టలు, పచ్చని చెట్లతో అలరారుతూ ఉంటుంది. అయితే ఈ ప్రాంతంలో ఓ యువతీ తన స్నేహితుడితో కలిసి కారులో వెళ్ళింది. వాస్తవానికి ఆమెకు కారు డ్రైవింగ్ రాదు. సోషల్ మీడియాలో రీల్స్ చేసేందుకు కారు ఎక్కింది. అంతకుముందే ఆ కారును ఆమె స్నేహితుడు ఎత్తైన ప్రాంతంలో పార్క్ చేశాడు. ఆ ప్రాంతం నుంచి తాను కిందికి తీసుకొస్తానని అతడికి చెప్పింది. “నువ్వు కెమెరాలో షూట్ చేయి” అని ఆదేశించింది. దానికి అతడు ఓకే అన్నాడు. ఈలోపు ఆ యువతి కారెక్కింది. ఎట్టి పరిస్థితుల్లో యాక్స్ లేటర్ నొక్కొద్దని అతడు సూచించాడు. ఎత్తైన ప్రాంతం నుంచి కారు వస్తున్న నేపథ్యంలో ఆ యువతి భయపడింది. పొరపాటున బ్రేక్ నొక్కపోయి యాక్స్ లేటర్ మీద కాలు పెట్టింది. దీంతో కారు పక్కన ఉన్న లోయలోకి దూసుకెళ్లింది.

    ఎత్తైన ప్రాంతం నుంచి రయ్యిమంటూ కారు లోయలో పడటంతో ఆ యువతి అందులో పడి మృతి చెందింది. ఆమె స్నేహితుడు కేకలు వేస్తున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఈ ప్రమాదం మొత్తం అతడు షూట్ చేస్తున్న కెమెరాలో రికార్డయింది. దీంతో ఆ యువకుడు అర్తనాదాలు చేశాడు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. దీంతో వారు లబోదిబో మనుకుంటూ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సంఘటనా స్థలానికి వచ్చారు. లోయలో పడిన వాహనాన్ని బయటకి తీశారు. యువతీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమె స్నేహితుడు రికార్డు చేసిన వీడియోను సాక్ష్యాధారంగా స్వీకరించారు. కాగా, ఈ సంఘటన మహారాష్ట్రలో సంచలనంగా మారింది.