Madhusudana Chari: ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలవడంతో టీఆర్ఎస్‌లో రాజకీయ నిరుద్యోగుల సంఖ్య కొంత తగ్గుతోంది. కానీ కొందరు ఆశావహులకు మాత్రం నిరాశే ఎదురవుతోంది. పదవి ఆశించి భంగపడ్డవారికి మళ్లీ వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని చెబుతున్నట్టు తెలుస్తోంది. కానీ రాబోయేవి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు. కాబట్టి అందులో ఆయా జిల్లా స్థాయి నాయకులకే పదవులు దక్కే అవకాశం ఉంది.

కౌశిక్ రెడ్డి స్థానంలో మధుసూధనాచారి..
మొత్తానికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరనే అంశంపై ఒక క్లారిటీ వచ్చింది. ఇందులో కాంగ్రెస్ నుంచి వచ్చిన పాడి కౌశిక్ రెడ్డి, సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, బండ ప్రకాశ్, గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, తక్కెళ్లపల్లి రవీందర్ రావ్‌లు ఉన్నారు. అయితే ఎన్నోరోజులుగా ఎమ్మెల్సీ పదవిపై ఆశపెట్టుకున్న శాసన సభ స్పీకర్ మధుసూదనాచారి కూడా ఈ సారి అవకాశం దక్కనుంది. గవర్నర్ కోటాలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన ఫైల్‌ను బుధవారమే రాజ్‌భవన్‌కు పంపించారు. నిజానికి గవర్నర్ కోటాలో అంతకు ముందే పాడి కౌశిక్ రెడ్డి పేరు సిఫార్సు చేశారు. సామాజిక సేవా రంగంలో ఆయన పేరును సూచిస్తూ మంత్రి వర్గం తీర్మాణం చేసింది. ఆ ఫైల్ ను గవర్నర్‌కు పంపించినా.. దానిని ఇప్పటి వరకు ఆమోదించలేదు. అందుకే కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో శాసన మండలికి పంపించి, ఆ స్థానంలో మధుసూధనాచారికి అవకాశం ఇచ్చారు.
శాసన మండలి చైర్మన్ బాధ్యతల అప్పగింత ?
మధుసూధనాచారికి ఎమ్మెల్సీగా పంపించి, శాసన మండలి చైర్మన్ బాధ్యతలు కూడా అప్పజెప్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ ఆవిర్భవించిన నాటి నుంచి ఆయన పార్టీ వెంటే ఉన్నారు. పైగా సీఎం కేసీఆర్ కు సన్నిహితుడిగా పేరుంది. అందుకే 2014 ఎన్నికల్లో ఆయనకు భూపాలపల్లి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అనంతరం శాసన సభ స్పీకర్ ను కూడా చేశారు. అయితే 2018 లో వచ్చిన ముందస్తు ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. దీంతో ఆయన అప్పటి నుంచి కాళీగానే ఉంటున్నారు. ఎమ్మెల్సీ పదవిపై ఆశతో ఉన్నారు. ఎట్టకేలకు ఆయన కోరిక నెరవేరనుంది. మొదట శాసన మండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్ ని నియమించాలని అనుకున్నారు. కానీ ఆయనకు మంత్రి పదవి ఇస్తారనే వార్త చక్కర్లు కొడుతోంది. రాజకీయ సమీకరణాల దృశ్యా రాజసభ్యుడి నుంచి ఎమ్మెల్సీ కాబోతున్న బండ ప్రకాశ్‌కు కూడా మంత్రి పదవి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈటెల రాజేందర్ స్థానాన్ని భర్తీ చేయాలని చూస్తున్నారు. శాసన సభ ను నడిపించిన మధుసూధనాచారి, ఇప్పుడు మండలి కూడా నడిపించనున్నారన్నమాట.