JanaSena: ఏపీలో జనసేన ఎన్ని పార్లమెంట్ స్థానాలను పోటీ చేస్తుంది? ఆ పార్టీ పోటీ చేసే నియోజకవర్గాలు ఏవి? అన్న చర్చ జోరుగా సాగుతోంది. పవన్ పొత్తు ప్రకటన చేసిన తర్వాత రెండు పార్టీల మధ్య సమన్వయం ప్రారంభమైంది. ఆత్మీయ సమావేశాల నిర్వహణకు కసరత్తు చేస్తున్నారు. ఉభయ పార్టీల విస్తృత సమావేశాన్ని సైతం నవంబర్ మొదటి వారంలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇటువంటి తరుణంలో బలమైన పార్లమెంట్ స్థానాలపై చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మచిలీపట్నం పార్లమెంట్ స్థానాన్ని జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది.
గత ఎన్నికల్లో పార్లమెంట్ స్థానాల్లో విశాఖ, నరసాపురం, కాకినాడ, మచిలీపట్నం నియోజకవర్గాల్లో జనసేనకు గణనీయమైన ఓట్లు లభించాయి. దీంతో ఈ నియోజకవర్గాలపై జనసేన ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఏపీలో ఉన్న 25 పార్లమెంట్ స్థానాల్లో.. దాదాపు పది వరకు జనసేనకు కేటాయించాలని ప్రతిపాదన వెళ్లినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో జనసేన ప్రాతినిధ్యం ఉండేలా పవన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ముఖ్యంగా మచిలీపట్నం నియోజకవర్గం విషయంలో బలమైన చర్చ నడుస్తోంది. జనసేనకు విడిచి పెట్టేందుకు టిడిపి స్థిరమైన నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ కచ్చితంగా పోటీ చేస్తుంది. మచిలీపట్నం నియోజకవర్గాన్ని మాత్రం తమకు విడిచిపెట్టాలని జనసేన కోరుతోంది. గత ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి దాదాపు లక్షా 13 వేల ఓట్లను సాధించారు. వైసీపీ అభ్యర్థి బాలశౌరి 60 వేల మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం టిడిపి, జనసేనతో పొత్తు ఉండడంతో కచ్చితంగా గెలుచుకున్న స్థానాల్లో మచిలీపట్నం ఒకటి. వైసీపీ అభ్యర్థి మెజారిటీ కంటే రెండు రెట్లు ఓట్లు జనసేన సాధించింది. అందుకే ఈ స్థానాన్ని కోరుకుంటుంది.
మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో కాపులు అధికం. మచిలీపట్నం, పెడన, పెనమలూరు, గుడివాడ, అవనిగడ్డలో కాపు సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ. 2009, 2014 ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన కొనకళ్ళ నారాయణ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 2024 ఎన్నికల్లో సైతం ఆయనే పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. జనసేన మాత్రం మచిలీపట్నం పార్లమెంటు స్థానాన్ని తమకే విడిచి పెట్టాలని టిడిపి హై కమాండ్ కు ఇప్పటికే ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి టిడిపి సైతం సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కొనకళ్ళ నారాయణను అసెంబ్లీకి పంపించేందుకు టిడిపి యోచిస్తోంది. అదే సమయంలో మచిలీపట్నం పార్లమెంటు స్థానం పరిధిలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను జనసేనకు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అటు జనసేన సైతం రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్థానాల పరిధిలో.. ఒకటి, రెండు అసెంబ్లీ స్థానాలు ఉండేలా చూసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతానికైతే ఏపీలో మచిలీపట్నం పార్లమెంటు స్థానం పొత్తులో భాగంగా జనసేనకు విడిచి పెట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి సీట్ల సర్దుబాటులో ఏం జరుగుతుందో చూడాలి.