Nara Lokesh: యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తాను వేసిన పరువు నష్టం దావాలకు సంబంధించి కోర్టులో వాంగ్మూలం ఇచ్చేందుకు లోకేష్ తాత్కాలికంగా పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం లోకేష్ యాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. ఇటీవలే ప్రకాశం జిల్లాలో ముగించుకొని.. గుంటూరులో అడుగు పెట్టింది. లోకేష్ మంగళగిరి కోర్టు హాజరు కానున్న నేపథ్యంలో గురువారం సాయంత్రమే యాత్రను ముగించారు. తిరిగి యాత్ర శనివారం ఉదయం నుంచి ప్రారంభం కానుంది.
తనపై వైసీపీ నేతలు చేసిన అసత్య ఆరోపణపై లోకేష్ న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ అజయ్ రెడ్డి తో పాటు సాక్షిమీడియాపై లోకేష్ పరువు నష్టం దావా వేశారు. ఇప్పటికే న్యాయవాది ద్వారా నోటీసులు జారీ చేశారు. వారి నుంచి ఎటువంటి సమాధానం లేకపోవడంతో క్రిమినల్ పరువు నష్టం కింద మంగళగిరి కోర్టులో కేసు వేశారు. ఈ రెండు కేసుల వ్యవహారంలో తనపై చేసిన అసత్య ఆరోపణలపై లోకేష్ న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు.
టిడిపి ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ లో భారీ స్కాం జరిగిందని లోకేష్ పై చైర్మన్ అజయ్ రెడ్డి ఆరోపణలు చేశారు. తనకు సంబంధం లేని అంశంపై చేసిన ఆరోపణలతో అజయ్ రెడ్డికి లోకేష్ నోటీసులు పంపించారు. దానికి ఆయన నుంచి సమాధానం లేకపోవడంతో పరువుకు భంగం కలిగించిన అజయ్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని మంగళగిరి కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. అలాగే స్కిల్స్ స్కాం అంటూ సాక్షిలో వేసిన కథనంపై కూడా ఆ పత్రికకు లోకేష్ నోటీసులు పంపారు. పత్రికా యాజమాన్యం ఎటువంటి వివరణ ఇవ్వకపోవడంతో ఆ పత్రిక పై కూడా క్రిమినల్ కేసు దాఖలు చేశారు. దీనికి స్వయంగా హాజరై వాంగ్మూలం ఇచ్చారు. అందుకే పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు.
కాగా మంగళగిరి కోర్టుకు లోకేష్ హాజరుకానున్నారని తెలుసుకొని టిడిపి శ్రేణులు భారీగా తరలివచ్చాయి. దీంతో కోర్టు ప్రాంగణం రద్దీగా మారింది. టిడిపి శ్రేణుల హడావుడి కనిపించింది. ఈరోజు సాయంత్రం విశ్రాంతి తీసుకోనున్న లోకేష్.. శనివారం ఉదయం యధావిధిగా పాదయాత్రను ప్రారంభించనున్నారు.