
TDP Lokesh : రానున్న ఎన్నికలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకం. ప్రతి నియోజకవర్గంలోనూ గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికపై అధినేతలు కసరత్తు చేస్తుంటారు. ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టే గెలుపు గుర్రాలను బరిలోకి దింపేందుకు అప్పటికప్పుడు నిర్ణయాలు జరుగుతుంటాయి. కానీ పాదయాత్రలో లోకేశ్ చేపడుతున్న యువగళం పాదయాత్రలను అభ్యర్థులను కూడా ప్రకటించేస్తున్నారు.
లోకేశ్ ముందస్తు అభ్యర్థులు అంతా ఆయా నియోజకవర్గాల్లో ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్న వారే. పలుచోట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇన్‌చార్జీలను మార్చాలని అడుగుతున్నారు. ఫలానా చోట అభ్యర్థి మారిస్తేనే గెలుపు సాధ్యమవుతుంది. వీటన్నింటిని లెక్కలేసుకొనే ఆయన ప్రకటనలు చేస్తున్నారా అన్న అనుమానాలు టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి.
రాయలసీమలో పాదయాత్ర చేస్తున్న లోకేష్ ఇప్పటి వరకు ఆరుగురు అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా పుంగనూరుకు చేరుకున్న సందర్భంలో అక్కడ అభ్యర్థిగా చల్లా రామచంద్రారెడ్డి పేరును ప్రకటించేశారు. ఇక్కడ వైసీపీ తరుపున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బలంగా ఉన్నారు. ఆయనను ఢీకొనే సత్తా చల్లాకు లేదని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. లోకేష్ ప్రకటన అనంతరం వారంతా నిట్టూర్పునకు గురయ్యారు. ఒక్క నగరిలో మాత్రమే గాలి భానుప్రకాశ్‌కు సానుకూల అవశాకాలున్నాయి. అది కూడా వైసీపీలో అంతర్గత విభేదాలతో రోజాకు ఇబ్బందులు ఎదురు కావచ్చనే ప్రచారం జరుగుతోంది.
కాగా, లోకేష్ అభ్యర్థుల ప్రకటనలతో వైసీపీలో జోష్ పెరుగుతోంది. ఆల్రెడీ ఇన్‌చార్జ్‌గా ఉన్న వారికే ఎక్కువగా టికెట్లు ఇస్తారనే సంకేతాలు వెళ్లాయి. దీంతో మళ్లీ తమకే అధికారం అనే నమ్మకం, ధైర్యం వైసీపీ కార్యకర్తలు, నేతల్లో కలుగుతున్నాయి. పాదయాత్రలో అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో చంద్రబాబు కసరత్తు లేదు, తొక్కా లేదంటూ టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. బలహీనమైన అభ్యర్థుల ఖరారు, గెలుపుపై నమ్మకం సన్నగిల్లుతుండడంతో టీడీపీ శ్రేణుల్లో అసహనం వ్యక్తమవుతోంది. వైసీపీకి అభ్యర్థుల ఖరారు విషయంలో కావాల్సినంత సమయం, ఎంపికకు మంచి అవకాశం ఇస్తున్నట్టే కదా అని అంటున్నారు.