Double Bed Room
Double Bed Room: బీఆర్‌ఎస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు కాళేశ్వరం, విద్యుత్ ఒప్పందాల్లో అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, లిక్కర్ స్కాంలో కవిత జైలుకు వెళ్లడం వంటివి ఆ పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి. మరోవైపు గులాబీ పార్టీలో ఉండి పదేళ్లు వివిధ పదవులు అనుభవించిన వారు అధికార కాంగ్రెస్‌లో చేరుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా పార్టీ మారుతున్నారు. ఈ క్రమంలో పార్టీ అధినేత కేసీఆర్‌కు, ఆ పార్టీ కంటోన్మెంట్ అభ్యర్థి నివేదితకు డబుల్ సెగ తగిలింది. నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల ఇవ్వడం లేదని మొన్న కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద ఇల్లు కేటాయించాలని ఆందోళన చేశారు. ఇక నిన్న నివేదిత ఇంటి వద్ద డబుల్ బెడ్‌రూం పేరుతో తమ నుంచి వసూరు చేసిన డబ్బులు ఇవ్వాలని బాధితులు ఆందోళనకు దిగారు. దీంతో నివేదిత నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీఆర్‌ఎస్‌కు చెందిన నేతలు, సాయన్న అనుచరులుగా ముద్ర పడిన వారే డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఆందోళన చేయడం సంచలనంగా మారింది.
రూ.1.46 కోట్లు వసూలు..
నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని పేరుత దివంగగత ఎమ్మెల్యేలు సాయన్న, ఆయన కుమార్తె లాస్య నందిత, ప్రస్తుత బీఆర్‌ఎస్ అభ్యర్థిథ నివేదిత నియోజకవర్గంలోని ప్రజల నుంచి రూ.1.46 కోట్లు వసూలుచేసినట్లు బీఆర్‌ఎస్ లీడర్ సదానంద్‌గౌడ్ తెలిపారు. నియోజకవరలోని 30 మంది నుంచి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు తీసుకున్నారని ఆరోపించారు. ఇండ్ల కోసం ఒత్తిడి చేయగా గతేడాది రూ.12 లక్షలు తిరిగి ఇచ్చారని తెలిపారు. మిగతా రూ.1.34 కోట్లు ఇవ్వాలని ఇంటి చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వసూలు చేసిన డబ్బులు ఇవ్వకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
లాస్యనందిత ఆడియో వైరల్..
ఇదిలా ఉండగా బీఆర్‌ఎస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీలో భారీగా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. అర్హులైన ప్రతీ పేదవాడికి పైరవీలు లేకుండా డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పిన మాజీ సీఎం కేసీఆర్ మాటలకు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఘటనలకు చాలా తేడా ఉంది. నాటి అధికార పార్టీ నేతలే ఇళ్ల పంపిణీ కోసం అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. ఈ క్రమంలో దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత వసూళ్ల దందాకు చెందిన ఆడియో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైరల్‌గా మారింది. ఆ ఆడియో.. దివంగత ఎమ్మెల్యే లాస్య నందితది అని తేలింది. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కోసం ఓ వ్యక్తి నుంచి రూ.5 లక్షలు డబ్బులు తీసుకున్నట్టు ఈ ఆడియో ద్వారా తెలిసింది. ఇళ్లు ఇవ్వకపోగా.. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ఈ వివాదం జరిగింది.
వీడియోలో ఇలా..
ఇక వైరల్ అయిన వీడియోలో లాస్య నందిత తన తండ్రి సాయన్న పదవిని అడ్డు పెట్టుకుని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఉంది. లాస్య నందిత రూ.5 లక్షలు తీసుకున్నట్లు వీడియోలో అంగీకరించింది. అయితే డబుల్ బెడ్ రూమ్ ఇంటిని ఇప్పించలేనందున వడ్డీ రూ.3 లక్షలు కలిపి రూ.8 లక్షలు ఇవ్వాలని బాధితుడు లాస్యనందితను డిమాండ్ చేయడం వీడియోలో ఉంది. వడ్డీ ఎలా ఇస్తానని లాస్య అతనితో వాదించింది. ఇదిలా ఉండగా తాజాగా సాయన్న రెండో కుమార్తె నివేదిత కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు పలువురు ఆరోపించడం సంచలనంగా మారింది.