
తెలంగాణలో అడుగులు లాక్ డౌన్ దిశగా పడుతున్నాయి. పైకి తక్కువ కేసులు చూపుతున్నా.. ఆస్పత్రులన్నీ నిండిపోవడం.. బెడ్స్ ఖాళీలేని పరిస్థితులు.. మరణాలు అధికసంఖ్యంలో నమోదు అవుతుండడంతో ఇక లాక్ డౌన్ తప్ప మరో మార్గం లేదని కేసీఆర్ సర్కార్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈరోజు కీలకమైన కేబినెట్ మీటింగ్ ను సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ పక్కనున్న కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో లాక్ డౌన్ అమల్లో ఉంది. అయిని అక్కడ కరోనా తీవ్రత అంతగా తగ్గడం లేదు. మరికొన్ని వర్గాలు మాత్రం లాక్ డౌన్ పెట్టాలని కోరుతున్నాయి.
ప్రధానంగా తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి రోగులు పెద్దఎత్తున వస్తుండడంతో వారికి చికిత్స అందించడం తెలంగాణలో సమస్యగా మారింది. తెలంగాణలోని బాధితులకు పూర్తి స్థాయిలో చికిత్సలు అందించలేకపోతున్న పరిస్థితి నెలకొంది. టీకాలు, ఆక్సిజన్, రెమెడిసివిర్ వంటి ఔషధాలకు ఇబ్బందిగా ఉందని వైద్య ఆరోగ్య వర్గాలు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తోంది.
ఇక రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉన్న తెలంగాణలో కేసులు మాత్రం తగ్గడం లేదు. దీంతో ఇక లాక్ డౌన్ వల్లనే నియంత్రణ సాధ్యమని కేసీఆర్ సర్కార్ డిసైడ్ అయినట్లు సమాచారం.
ఇక తెలంగాణ హైకోర్టు కూడా లాక్ డౌన్ విషయమై ఆలోచించాలని కేసీఆర్ సర్కార్ ను కోరింది. ఈ క్రమంలోనే కేసీఆర్ ఈ రోజు నిర్వహించే కేబినెట్ సమావేశంలో చర్చించి తెలంగాణలో లాక్ డౌన్ పెట్టేదిశగా ఆలోచిస్తున్నారని సమాచారం.