దేశంలో విజృంభిస్తున్న కరోనా, లాక్ డౌన్ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కరోనా వైరస్ దేశ ఆర్థిక వ్యవస్థపై సైతం తీవ్ర ప్రభావం చూపింది. కోట్ల సంఖ్యలో ప్రజలు ఉద్యోగాలు కోల్పోగా వ్యాపారాలు చేసేవాళ్లు లాక్ డౌన్ వల్ల నష్టాలను చవిచూశారు. దీంతో కేంద్రం, ఆర్బీఐ మార్చి నెల నుంచి ఆగష్టు చివరి వారం వరకు లోన్లపై మారటోరియం విధించింది. అయితే నిన్నటితో మారటోరియం గడువు ముగియడంతో ప్రజలు తిరిగి లోన్లు కట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
ఉపాధి, ఉద్యోగవకాశాలను కోల్పోయిన వాళ్లు ప్రస్తుత పరిస్థితుల్లో లోన్లు కట్టాలని నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ఆచరణ సాధ్యం కాదు. ఈరోజు సుప్రీం కోర్టులో లోన్ మారటోరియం అంశానికి సంబంధించి విచారణ జరుగుతోంది. విచారణలో భాగంగా కేంద్రం రెండు సంవత్సరాల వరకు లోన్ మారటోరియం ఫెసిలిటీని పొడిగించవచ్చని సుప్రీం కోర్టుకు తెలిపింది. ప్రస్తుతం కేంద్రం రెండేళ్ల మారటోరియం గురించి కసరత్తు చేపడుతోంది.
అయితే కేంద్రం రెండేళ్ల వరకు మారటోరియం పొడిగించే అవకాశం ఉందని చెప్పినా ఆ అంశం పూర్తిగా ఆర్బీఐ పరిధిలోనిదని పేర్కొంది. ఆర్బీఐ, బ్యాంకులు కలిసి మారటోరియం పొడిగింపు గురించి నిర్ణయం తీసుకోవాలని ప్రకటించింది. అయితే బ్యాంకులు మాత్రం ఇప్పటికే మారటోరియం వల్ల నష్టపోయాని… మరోసారి మారటోరియంను పొడిగించకపోతేనే మంచిదని చెబుతుండటం గమనార్హం. మరోవైపు ఈఎంఐలపై వడ్డీ మినహాయింపు అంశం గురించి రేపు కోర్టులో విచారణ జరగనుండగా విచారణ అనంతరం సుప్రీం కోర్టు తీర్పును వెలువరించనుంది.