Liz Truss: ప్రవాస భారతీయుడు, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ పై ఘన విజయం సాధించి బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టింది లిజ్ ట్రస్. మహిళా ప్రధానిగా ఖ్యాతి గడించింది. కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల మద్దతుతో గద్దెనెక్కింది. ఇక వ్యాపారాలు, ఆర్థిక నిర్వహణలో మంచి నైపుణ్యం ఉన్న రిషి సునక్ ఈ పోరులో భారతీయుడన్న ఒకే ఒక్క కారణంతో జాతి వివక్షతో బ్రిటన్ ప్రధాని పదవికి పోటీలో ఓడిపోయాడు. పార్టీలోని సభ్యులంతా బ్రిటీష్ జాతికి చెందిన లిజ్ ట్రస్ కే ఓటేశారు. కానీ ఇప్పుడు ఫలితం అనుభవించారు.

బ్రిటన్ లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన లిజ్ ట్రస్ అనుభవరాహిత్యంతో దేశాన్ని మరింత ఆర్థిక కష్టాల్లోకి నెట్టారు. ఆమె ప్రకటించిన మినీ బడ్జెట్ తో దేశంలో మాంద్యం తలెత్తింది. ఉన్న మాంద్యాన్ని చక్కదిద్దకపోగా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను మరింత గందరగోళానికి గురిచేసింది. ఈ క్రమంలోనే ఆర్థిక మంత్రి సహా మరో మంత్రి రాజీనామా చేశారు.
లిజ్ ట్రస్ పాలనవైఫల్యాలు.. ఆర్థిక నిర్వహణతో దేశం మాంద్యంలోకి జారుకుటుండడంపై సొంత పార్టీలోనే ఆమెపై విమర్శలు వచ్చాయి. ఆమెను దించేయడానికి పార్టీలోని కొందరు సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు. అత్యంత ఫెయిల్యూర్ ప్రధానిగా తిట్టిపోశారు. పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. చుట్టుముడుతున్న ఆరోపణలతో బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేశారు.
బ్రిటన్ ప్రధానిగా 45 రోజుల పాటు ఆమె పదవిలో కొనసాగారు. బ్రిటన్ చరిత్రలోనే అత్యంత తక్కువ కాలం ప్రధానిగా కొనసాగిన వ్యక్తి లిజ్ ట్రస్ నే కావడం గమనార్హం. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె తన రాజీనామాను బ్రిటన్ రాజుకు పంపించానని.. తదుపరి ప్రధానిని ఎన్నుకునే వరకూ పదవిలో కొనసాగనున్నట్టు తెలిపారు. తీవ్రఆర్థిక, అంతర్జాతీయ అస్థిరత కొనసాగుతున్న వేళ దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించిందని.. చక్కదిద్దడం కష్టమైందని ఆమె పేర్కొన్నారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం బ్రిటన్ కు ముప్పుగా పరిగణించిందన్నారు.