AP Abhayahastam: ఏపీలో అప్పులు కుప్పలయ్యాయి. దినదినగండంగా మారింది. ఎక్కడ అప్పు పుడుతుందా అని జగన్ సర్కార్ శూలశోధన చేస్తోంది. అప్పుల కోసం ఆర్బీఐ సహా సంస్థల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతోంది.జీతాలు, పెన్షన్లకు సైతం అప్పులు చేసి ఇస్తోంది. ఇంతటి దుర్భర పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం పథకాలకు వివిధ సంస్థలకు ఇచ్చిన అడ్వాన్సులను కూడా వెనక్కి తీసుకుంటున్న దీనమైన పరిస్థితి నెలకొందా? అంటే తాజాగా ఎల్ఐసీ ప్రకటన చూస్తే ఔననే అనక మానదు..
జగన్ సర్కార్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని కాగ్ సహా అప్పుల తీరు చూస్తుంటే ఇట్టే అర్థమవుతోంది. డబ్బుల కోసం సంస్థలను, వ్యవస్థలను ఎంతగా వేధించి.. వెంటాడుతుందో రోజూ మీడియాలో కథలు కథలుగా వస్తోంది. వైసీపీ సర్కార్ తో వేగలేక గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను ఒక్కొక్క సంస్థ రద్దు చేసుకుంటున్నాయి.
తాజాగా అభయహస్తం పథకం అమలు కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (నోడల్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ)తో 2009 అక్టోబర్ 27న జీవిత బీమా సంస్థ కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఇప్పుడు రద్దు చేసుకుంది.ఏపీ ప్రభుత్వ అభయహస్తం పథకంతో ఇక మీదట తమ సంస్థకు ఎటువంటి సంబంధం లేదని ఎల్ఐసి బహిరంగ ప్రకటన జారీచేసింది.ఆ పథకం కోసం తమ వద్ద ఉన్న 2000 కోట్ల నిధిని(ప్రీమియం కింద లబ్ధిదారులు చెల్లించిన సొమ్ములు) ప్రభుత్వం డ్రా చేసేసినందున మా ఒడంబడిక రద్దు అయినట్లుగా ప్రకటనలో పేర్కొంది.
ప్రీమియం డబ్బులు కూడా వాడేసే దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉందా అని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎల్ఐసీ వైదొలగడంతో ఇప్పుడు అభయహస్తం పథకం అటకెక్కినట్టైంది. ఈ పథకం కింద తన అన్ని పాలసీ, లబ్ధిదారులకు డబ్బుల చెల్లింపులు ఆగిపోనున్నాయి. ఇక నుంచి లబ్ధిదారుల క్లెయిమ్ లు, పెండింగ్ లో ఉన్న క్లెయిమ్ లు, భవిష్యత్ లో వచ్చే క్లెయిమ్ లు అన్నింటిని పరిష్కరించడం ఏపీ ప్రభుత్వానికి తలకుమించిన భారం అవుతుంది. దీన్ని అమలు చేయడం జగన్ సర్కార్ కు అసాధ్యం..
దీంతో ఒక గొప్ప మంచి పథకం జగన్ సర్కార్ అప్పుల తిప్పల్లో కనుమరుగైపోయినట్టైంది. జగన్ సర్కార్ డబ్బుల కొరతతో అభయహస్తం డబ్బులను లాగేసుకోవడంతో ఇప్పుడు ఏపీలోని కోట్ల మందికి అభయహస్తం అందకుండా పోతోంది. ఇంత గొప్పమంచి పథకాన్ని కాసుల కొరతతో జగన్ సర్కార్ నీరుగార్చినట్టైంది. కోట్ల మంది ప్రజలకు ఇప్పుడు చివరాఖరున డబ్బులు అందక అష్టకష్టాలు పడే పరిస్థితి ఏర్పడనుంది. మరి ఈ సమస్యను ఏపీ ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుంది? అన్ని కోట్లు ఎలా సర్ధుబాటు చేస్తుందనేది వేచిచూడాలి.