Anil Kumar Yadav: రాజకీయంగా కొన్నిసార్లు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. రాజకీయాల్లో జరిగినంత కాలం అలా వెళ్ళిపోతుంది.. ప్రతికూలత ఎదురైతే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. ఇప్పుడు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్( Anil Kumar Yadav) పరిస్థితి కూడా అదే. నెల్లూరు సిటీకి వచ్చి రాజకీయాలు చేయలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో అప్పుడప్పుడు చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోతున్నారు. మొన్నటికి మొన్న నెల్లూరు కార్పొరేషన్ మేయర్ స్రవంతి రాజీనామా చేశారు. కానీ ఆ విషయంలో కూడా అనిల్ కుమార్ యాదవ్ ఏమి పట్టనట్టుగా ఉన్నారు. అధినేత తనకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుంటే తానేం చేసేది అని అనిల్ కుమార్ యాదవ్ తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగా తనను పార్టీలో దూరం పెట్టడంపై చాలా ఆవేదనతో ఉన్నారట అనిల్ కుమార్ యాదవ్. అయితే ఆయనకు వేరే ఆప్షన్ లేకపోవడంతోనే పార్టీలో కొనసాగుతున్నారన్న టాక్ ఉంది.
* ఫుల్ సైలెన్స్
మొన్నటి ఎన్నికల్లో నరసరావుపేట( Narasaraopeta) పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు అనిల్ కుమార్ యాదవ్. ఓటమి ఎదురైన తర్వాత పెద్దగా కనిపించకుండా మానేశారు. ఇటు నెల్లూరు వైపు రావడం లేదు. అటు నరసరావుపేట వెళ్లడం లేదు. పక్క రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు నెల్లూరు వచ్చి కూటమినేతలపై విమర్శలు చేస్తున్నారు. అది కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపి వైపు వెళ్లిన వారిపై మాత్రమే టార్గెట్ చేయగలుగుతున్నారు. మిగతా వారి జోలికి మాత్రం వెళ్ళలేక పోతున్నారు. ఈ పరిస్థితికి వైసిపి హై కమాండ్ కారణమన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకో అనిల్ కుమార్ యాదవ్ ను జగన్మోహన్ రెడ్డి దూరం పెడుతున్నట్లు ఒక ప్రచారం మాత్రం ఉంది.
* వరుసగా రెండుసార్లు గెలుపు..
2014, 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ( Nellore City) నుంచి గెలిచారు అనిల్ కుమార్ యాదవ్. రెండు ఎన్నికల్లోనూ అతి కష్టం మీద గెలవగలిగారు. అయితే జగన్మోహన్ రెడ్డి కోసం ఎంత దాకైనా వెళ్లేందుకు అనిల్ కుమార్ యాదవ్ సిద్ధంగా ఉంటారు. ఇది చాలా సందర్భాల్లో చూసాం కూడా.. అయితే గడిచిన ఎన్నికల్లో ఆయనపై వ్యతిరేకత రావడంతో నరసరావుపేట పంపించారు. అక్కడ ఓడిపోయిన తర్వాత తిరిగి నెల్లూరు వస్తానని అనిల్ కోరగా.. అందుకు జగన్మోహన్ రెడ్డి అంగీకరించలేదు. అక్కడ కొత్తగా ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డిని ప్రోత్సహిస్తున్నారు. దీంతో అనిల్ కుమార్ యాదవ్ ఎంట్రీ కి జగన్ ఇష్టపడడం లేదు. అది తెలిసి అనిల్ కుమార్ యాదవ్ సైతం సైలెంట్ కావాల్సి వస్తోంది. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీలో కానీ.. జనసేనలో కానీ చేరలేరు. ఆ రెండు పార్టీలు అనిల్ కుమార్ యాదవ్ ను పట్టించుకోవు. అందుకే ఆయనకు వేరే ఆప్షన్ లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండాల్సిందే.
* ఆ నేతలంతా దూరం కావడం వెనుక..
నెల్లూరులో పార్టీ ఈ పరిస్థితికి రావడానికి అనిల్ కుమార్ యాదవ్ కారణమన్న వాదన వినిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy)సైతం దీనిని గ్రహించినట్లు తెలుస్తోంది. నమ్మకస్తులైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి నేతలను వదులుకోవడం వెనుక అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారన్నది జగన్మోహన్ రెడ్డికి వచ్చిన నివేదిక. ఉద్దేశపూర్వకంగానే పార్టీ నుంచి నేతలందరినీ బయటకు పంపించడంలో అనిల్ పాత్ర ఉందని జగన్మోహన్ రెడ్డికి సమాచారం ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ విషయంలో పునరాలోచనలో పడ్డారు. నెల్లూరు జిల్లాకు అందుకే దూరంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి..