Pawan Kalyan : ‘వ్యవస్థల్లో జరుగుతున్న తప్పులపై బలమైన పోరాటం చేద్దాం.. ఈ ప్రభుత్వం చేసే ప్రతి తప్పును కేసులకు వెరవకుండా ఎండగడదాం. ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉందాం. పార్టీపక్షాన లీగల్ టీమ్ భరోసాగా నిలుస్తుంది’ అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శనివారం రాత్రి పవన్ కళ్యాణ్ ర్యాలీ అనంతరం పోలీసులు అరెస్టు చేసిన జనసేన పార్టీ నాయకులు, శ్రేణుల్లో కొందరికి బెయిల్ లభించడంతో సోమవారం వారిని పవన్ కళ్యాణ్ కలిసి, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా అరెస్ట్ సమయంలో, అలాగే పోలీస్ స్టేషన్లో పోలీసులు వ్యవహరించిన తీరును పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ “ఈ ప్రభుత్వంతో బలమైన పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా సమష్టిగా ఉండి ముందుకు వెళ్దాం. కచ్చితంగా జనసేన పార్టీ శ్రేణులు న్యాయపరమైన అంశాల పట్ల చైతన్యవంతులుగా మారాలి. న్యాయపరమైన అంశాలను అక్రమ అరెస్టులు సందర్భంగా కచ్చితంగా లేవనెత్తాలి. పోలీసులను గట్టిగా ప్రశ్నించాలి. జనసేన పార్టీ శ్రేణులు కేసులకు భయపడాల్సిన అవసరం లేదు. ప్రజా సమస్యల కోసం బలంగా పోరాడుదాం. మరింత రాటుదేలుదాం. ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ప్రాథమిక హక్కులు కల్పించింది. పోలీసులు అరెస్టు చేసినప్పుడు కచ్చితంగా వాటిని పాటించాలి. ఇష్టానుసారం పోలీసులు చేయి చేసుకునే హక్కు లేదు. దీనిని పోలీసులు పూర్తిగా అతిక్రమించారు. జనసేన పార్టీ నాయకులు మీద ఇష్టానుసారం చేయి చేసుకున్నారు. దీనిపై కచ్చితంగా జనసేన లీగల్ టీం న్యాయపరంగా పోరాడుతుంది. నాయకులకు అండగా ఉంటాం. పది, పదిహేను సంవత్సరాలు పాటు బలమైన పోరాటాలు చేసే శక్తి ఉన్న నాయకులు జనసేనకు ఉన్నారు. యుద్ధంలో సైనికుడు మాదిరిగా బలంగా యుద్ధం చేద్దాం. ప్రజా సమస్యలపై గొంతు ఎత్తాల్సిన అవసరం.. గళం వినిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేరళ తరహాలో పోలీసులు కచ్చితంగా పౌరుడి ప్రాథమిక హక్కులను కాపాడాలి. కాపాడాల్సిన వారే కాలరాస్తే ఎలా..? కచ్చితంగా దీనిని న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఎవరైతే జనసేన నాయకులుపై చేయి వేశారో వారందరి పేర్లు నాయకులు నమోదు చేయండి. దీని మీద పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేయండి” అన్నారు.

* కస్టడీలో ఇబ్బందిపెట్టారు: పార్టీ నాయకులు
ఈ సందర్భంగా నాయకులు తమకు పోలీస్ స్టేషన్లో ఎదురైన సంఘటనలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. పోలీసులు అరెస్టు చేసిన భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ సందీప్ పంచకర్ల పట్ల అమానుషంగా ప్రవర్తించారని, కేంద్ర కారాగారంలో గెడ్డం, మీసాలు తీసేయాలని బలవంతం చేశారని చెప్పారు. అలాగే నెలరోజుల క్రితం పార్టీలో జాయిన్ అయిన వీర మహిళ శ్రీమతి రూపను అర్ధరాత్రి ఇంటికి వెళ్లి మరీ అరెస్టు చేశారని, ఆరోగ్యం సరిగా లేకున్నా, చంటి పిల్లలతో ఉన్నానని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు. ఆమెను ఇప్పటికీ విడుదల చేయలేదని జైలులో ఉంచారని చెప్పారు. అలాగే పోలీస్ కస్టడీలో తమపై చేయి చేసుకున్నారని పార్టీ నాయకులు వాపోయారు. కావాలని ఇబ్బంది పెట్టారని చెప్పారు. వీటిని విన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు కచ్చితంగా పార్టీ అండగా ఉంటుందని లీగల్ టీం ఈ విషయాలు చూసుకుంటుందని, భవిష్యత్ లో కేసులకు ఏ మాత్రం భయపడకుండా మరింత ముందుకు వెళ్దామని వారికీ భరోసా ఇచ్చారు. తాను కూడా దానికే సిద్ధంగా ఉన్నానని నాయకులు, శ్రేణులకు చెప్పారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు.