Chiranjeevi- Menaka Suresh: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తల్లి మేనకా సురేష్ కూడా హీరోయిన్ అన్న విషయం చాలా మందికి తెలియదు. మేనక 80లలో హైయెస్ట్ పేయిడ్ యాక్ట్రెస్ గా సౌత్ ని ఏలారు. ముఖ్యంగా మలయాళ, తమిళ పరిశ్రమలలో వందకు పైగా చిత్రాలు చేశారు. 1980లో విడుదలైన రామయి వయసుక్కు వాన్ తుట్ట అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. అక్కడి నుండి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఏడాదికి 25 నుండి 30 సినిమాలు చేసిన ఘనత ఆమె సొంతం. ముఖ్యంగా మలయాళ చిత్ర పరిశ్రమను మేనక ఒక ఊపు ఊపారు.

కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే దర్శకుడు జి సురేష్ కుమార్ తో మేనకా లవ్ లో పడ్డారు. 1987లో వీరి వివాహం జరిగింది. భర్త కోసం కెరీర్ వదిలేసింది. సినిమాలకు గుడ్ బై చెప్పింది. మేనక వివాహం జరిగిన ఏడాది కూడా ఆమె హీరోయిన్ గా నటించిన ఆరు సినిమాలు విడుదలయ్యాయి. కాగా మేనక తెలుగులో కేవలం రెండు చిత్రాలు మాత్రమే చేశారు.
1980లో విడుదలైన పున్నమి నాగు, 1982లో వచ్చిన సుబ్బారావుకి కోపం వచ్చింది చిత్రాల్లో నటించారు. పున్నమి నాగులో మూవీలో చిరంజీవి నెగిటివ్ షేడ్స్ ఉన్న డిఫరెంట్ రోల్ చేశారు. అప్పటికి చిరంజీవికి స్టార్ డమ్ రాలేదు. కెరీర్లో ఎదుగుతున్న రోజుల్లో విడుదలైన పున్నమి నాగు నటుడిగా మంచి పేరు తెచ్చింది. సినిమా సైతం విజయాన్ని సాధించింది. పున్నమి నాగు చిత్రంలో మేనకా చిరంజీవికి జంటగా నటించారు.

చిరంజీవి సినిమాలో మేనక హీరోయిన్ గా నటిస్తే.. ఆమె కూతురు కీర్తి సురేష్ ప్రస్తుతం చెల్లెలుగా నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్ అని సమాచారం. తమన్నా ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్ గా ఉన్న కీర్తి సురేష్ చెల్లెలు పాత్రలు చేయడం నిజంగా సాహసమే. ఇక కీర్తి తెలుగులో హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం దసరా.