కరోనా విజృంభన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలుచేస్తున్నారు. అయితే ఈ లాక్ డౌన్ పొడిగిస్తే మరిన్ని కష్టాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 37 రోజులపాటు అమలు చేస్తున్నారని ఇంకా పొడిగిస్తే ఆకలితోనే ఎక్కువ మంది చనిపోయే ప్రమాదముందని ఇన్పోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు.
అనేక అభివృద్ధి చెందిన దేశాల కంటే భారతదేశంలో కరోనా మరణాల రేటు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, లాక్ డౌన్ ఆంక్షలను ఎక్కువ కాలం కొనసాగించే అవకాశం లేదని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో సంక్రమణకు గురయ్యే వారిని జాగ్రత్తగా చూసుకుంటూ, సామర్థ్యం ఉన్నవారికి తిరిగి పనిని ప్రారంభించే వీలు కల్పించాలని నారాయణ అన్నారు. లేదంటే ఆకలి కారణంగా సంభవించే మరణాలు కరోనా వైరస్ మరణాలను మించిపోతాయన్నారు. చాలా సంస్థలు తమ ఆదాయంలో 15-20 శాతం కోల్పోయారన్నారు. అసంఘటిత రంగం, స్వయం ఉపాధి పొందుతున్న వారు సుమారు 20 కోట్లమంది ఉన్నారని, లాక్ డౌన్ పొడిగిస్తే వీరంతా మరింత సంక్షోభంలోకి కూరుకు పోతారని మూర్తి హెచ్చరించారు.