AP Cabinet: ఏపీ క్యాబినెట్ లో లీకు వీరులు ఉన్నారా? వారితో చర్చలు జరిపేందుకు జగన్ భయపడుతున్నారా? మంత్రిమండలి భేటీలో జగన్ ఆ వ్యాఖ్య ఎందుకు చేశారు? ఇక్కడొద్దు ఇంటికి రండి అంటూ మంత్రులను ఎందుకు కోరారు? గంటన్నరలోపే కీలకమైన క్యాబినెట్ సమావేశాన్ని ఎందుకు ముగించారు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. సీఎం జగన్ అధ్యక్షతన బుధవారం క్యాబినెట్ భేటీ జరిగిన సంగతి తెలిసిందే. అయితే కీలకమైన ఈ సమావేశాన్ని చాలా వేగంగా ముగించారు. రాజకీయంగా ఏదైనా మాట్లాడుకుందాము అంటే ఇంటికి రండి అంటూ జగన్ సహచర మంత్రులకు చెప్పుకొచ్చారు. ఈ సమావేశానికి టికెట్లు దక్కని మంత్రులు హాజరు కావడం, జగన్ ఈ వ్యాఖ్య చేయడంతో రకరకాల ఊహాగానాలు రేగుతున్నాయి.
క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సమావేశం అయ్యాక మంత్రి బొత్స సత్యనారాయణ సీఎం జగన్ తో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ సీఎం జగన్ ఇక్కడ వద్దంటూ వారించారు.ఇటీవల క్యాబినెట్లో ముగ్గురు మంత్రులను జగన్ మార్చారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ ను గాల్లో పెట్టారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామిని చిత్తూరు లోక్ సభ సమన్వయకర్తగా మార్చారు. గుమ్మనూరు జయరాంను తప్పించి కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన ఆసక్తి చూపడంతో తప్పించారు. ఈ ముగ్గురు మంత్రులు క్యాబినెట్ సమావేశానికి హాజరు కావడం విశేషం.
అయితే జగన్ మంత్రివర్గ సహచరులను అనుమానిస్తూ అక్కడ రాజకీయ చర్చలు జరపకపోవడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా క్యాబినెట్ సమావేశ అనంతరం అధికారులను అక్కడ నుంచి పంపించేస్తారు. మంత్రివర్గ సహచరులతో రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి సీఎం చర్చిస్తారు. ఇప్పటివరకు జరుగుతున్న ఆనవాయితీ ఇదే. కానీ ఈసారి ఆ విధానానికి జగన్ బ్రేక్ ఇచ్చారు. రాజకీయ అంశాల జోలికి పోలేదు. కొందరు మంత్రులు జగన్ విధానాలపై అసంతృప్తిగా ఉన్నారన్న సమాచారం మేరకనే ముఖ్యమంత్రి అలా వ్యవహరించారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా టిక్కెట్లు దక్కని మంత్రులు ఇతర పార్టీలతో టచ్ లోకి వెళ్లినట్లు అనుమానాలు ఉన్నాయి. మరి కొందరు మంత్రులు అయితే తమ ప్రమేయం లేకుండా టిక్కెట్ల ఎంపికపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల క్రమంలో రాజకీయాలు మాట్లాడితే రచ్చ అవుతుందని జగన్ భావించారు. ఏదైనా మాట్లాడాల్సి ఉంటే తన ఇంటికి రావొచ్చని సూచించారు. దీంతో క్యాబినెట్ లోనే సహచర మంత్రులు ఒకరిపై ఒకరు అనుమానంతో చూసుకోవాల్సి వచ్చింది. మొత్తానికి అయితే ఏపీ క్యాబినెట్లో లీకు వీరులు ఉన్నారని జగన్ అనుమానిస్తున్నారు. మరి ఆ లీకు వీరులు ఎవరో తెలియాల్సి ఉంది.