
TDP vs YCP : రాజకీయాలంటే నిబద్ధతతో కూడుకున్నవి. కానీ, ఇది ఒకప్పటి మాట. రాను రాను భ్రష్టు పట్టిపోతున్నాయి. సేవ చేసే వాళ్లు రాజకీయాలకు అర్హుతగా చెప్పేవారు. ఇప్పుడు ఇది ఒక నానుడిగానే మిగిలిపోయింది. అధికారం కోసం ఏ పార్టీ అయినా ఎంతకైనా తెగిస్తున్నారు. ఎంతవరకంటే తల్లిని, ఆలిని, చెల్లెలిని కూడా రాజకీయ రొంపిలోకి లాగి, సానుభూతి కోసం వెంపర్లాడటం పరిపాటిగా మారింది.
అసలు విషయానికొస్తే రాజకీయాల కోసం ఇంట్లో ఆడవారిపై వస్తున్న కామెంట్స్ ను రాజకీయ అవసరాలకు వాడుకోవడంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చక్కగా వాడుకుంటున్నారు. టీడీపీ నేతలు మాట్లాడిన రెచ్చగొట్టే మాటలకు వైసీపీ నేతలు మరింతగా ఉడికిపోయి భువనేశ్వరిపై అన్న వ్యాఖ్యలను తప్పుగా చూపిస్తే జనంలో మార్కుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ పరిస్థితి ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ఎక్కువగా ఉంటుంది. చంద్రబాబు, లోకేష్ సభల్లో మాట్లాడేటప్పుడు వాటిని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఏదో ఒక సందర్భంలో అన్న మాటలను పదే పదే వల్లవెస్తూ నిద్రాహారాలు కూడా పట్టడం లేదని అనడం వెనుక దురుద్దేశం లేకపోలేదు. అయ్యో, పాపం వారిని ఇలా అన్నారా అని సున్నితమైన అంశాలను బహిరంగంగ ప్రెస్ మీట్లు పెట్టి మరీ వారే తెలియజేస్తుంటారు.
మహిళలను రాజకీయాల కోసం వాడుకోవడం ఒక్క టీడీపీనే కాదు.. వైసీపీ కూడా తక్కువేమీ తినదనట్లుగా వ్యవహరిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ జైలు కెళ్లారు. అరెస్టులు చేసినప్పుడు.. ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతి రోడ్డుపైనే కూర్చొన్నారు. తమకు అన్యాయం జరిగిపోతుందని మీడియా ముందు మాట్లాడారు. షర్మిల అయితే ఏకంగా పాదయాత్రే చేసేసింది. ఆ తరువాత వీరి పరిస్థితి ఏమైందో అందరికీ తెలిసిందే.
నీతివంతమైన రాజకీయాలు చేస్తానని వస్తున్న పవన్ కల్యాణ్ ఒక్కరే.. అంతా తానై వ్యవహరిస్తుంది. ఎలాగైనా గెలవాలని కాకుండా, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటు వేయమని పిలుపునిస్తున్నారు. చంద్రబాబు, జగన్ లా రెచ్చిపోయి బహిరంగ సభల్లో మాట్లాడటం లేదు. పైగా పవన్ పెళ్లిళ్ల విషయంలో వారిరువురు ప్రజల ముందు అపరాధిగా చూపించే ప్రయత్నం చేశారు. ఆ తరువాత టీడీపీ సర్దుబాటు కోసం ఆయనతో సర్దుకుపోతూ సపోర్ట్ చేసే పనిలో ఉంది.
మహిళలు కూడా పురుషులకు కంటే ఎక్కువగానే రాణిస్తున్నారు. ఈ విషయాన్ని పక్కనపెట్టి సున్నితమైన అంశాలను తీసుకువచ్చి రాజకీయాల కోసం వాడుకోవడం అనేది క్షమించలేని విషయం. ఇప్పటికైన చంద్రబాబు, లోకేష్, జగన్ తమ రాజకీయ ఉపన్యాసాల్లో ఇంట్లో మహిళలను లాగకుండా ఉంటారని ఆశిద్దాం.