YCP Peddireddy : జగన్ తరువాత వైసీపీలో ఏ2 అంటే అందరూ సజ్జల రామక్రిష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి అని చెబుతారు. అదే జగన్ తరువాత అత్యంత శక్తిమంతుడైన లీడర్ అంటే మాత్రం అందరూ రాయలసీమ ‘పెద్ది’ రెడ్డినే చూపిస్తారు. ఆయనే సీనియర్ మోస్ట్ లీడర్, ఏడుపదులు దాటినా రాయలసీమనే ఏలుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పార్టీ అధినేత జగన్ కు విధేయుడు. ఒకానొక సమయంలో జగన్ జైలుకు వెళ్లడం అనివార్యంగా మారితే సీఎం పదవి ఎవరికి కట్టబెడతారన్న ప్రశ్నకు పెద్దిరెడ్డేనని ఎక్కువ మంది సమాధానమిచ్చారు. అందుకే అధినేత అతి క్లిష్టమైన రాయలసీమ రీజియన్ వైసీపీ బాధ్యతలు అప్పగించారు. ఆయన కూడా రాయలసీమ మొత్తం స్వీప్ చేయాలన్న తలంపుతో ఉన్నారు. చివరకు చంద్రబాబును సైతం కుప్పంలో ఓడిస్తానని శపథం చేశారు. కానీ అటువంటి నాయకుడ్ని ఇప్పుడు సొంత పార్టీ శ్రేణులు లెక్క చేయకపోవడం హాట్ టాపిక్ గా మారింది. సొంత పార్టీలోఆయనకు వరుసగా అవమానాలు ఎదురవుతున్నాయి. ఏకంగా ఆయనకు చెప్పు చూపించి హెచ్చరించే స్థాయికి పరిస్థితులు వెళ్లాయి.

రాయలసీమ రీజియన్ బాధ్యతలు తీసుకున్న పెద్దిరెడ్డి ఇటీవల నియోజకవర్గాల రివ్యూలు మొదలు పెట్టారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక్కో నియోజకవర్గంపై ఫోకస్ పెట్టిన ఆయన పార్టీ శ్రేణుల మధ్య ఉన్న విభేదాలను తొలగించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పెనుగొండ రివ్యూకు సిద్ధమయ్యారు. అయితే ఆయన వస్తున్న ఎన్ హెచ్ 44ను అసమ్మతి నాయకులు దిగ్బంధించారు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, తాజా మాజీ మంత్రి శంకర్ నారాయణపై ఫిర్యాదుకు సిద్ధపడ్డారు. అంతకంటే ముందుగానే ఎమ్మెల్యేశంకర్ నారాయణ అనుచరులు అక్కడకు రావడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు కలుగజేసుకొని వారిని చెదరగొట్టారు. సరిగ్గా అదే సమయంలో పెద్దిరెడ్డి అక్కడకు ఎంటరయ్యారు. మంత్రిని చూసిన అసమ్మతి నాయకులు మరింత ఆగ్రహంతో రెచ్చిపోయారు. కాన్వాయ్ ను అడ్డంగించారు. వాహనాలు కదలడానికి వీలులేదంటూ పట్టుబట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య గొడవ స్టార్ట్ అయ్యింది. దీంతో అసమ్మతి వర్గం నుంచి కొందరు మంత్రి పెద్దిరెడ్డికి చెప్పులు చూపించే సరికి ఆయన షాక్ కు గురయ్యారు.
హిందూపురం నియోజకవర్గంలో కూడా ఇటువంటి సీనే పెద్దిరెడ్డికి ఎదురైంది. అక్కడ ఎమ్మెల్సీ ఇక్బాల్ కు వ్యతిరేక వర్గం ఉంది. నియోజకవర్గ రివ్యూలో ఇక్భాల్ గా ప్రమోట్ చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డిపై వ్యతిరేక వర్గీయులు ఫైరయ్యారు. మంత్రి సమక్షంలోనే వాదనకు దిగారు. ఈ ఘటనతో పెద్దిరెడ్డి నొచ్చుకున్నారు. ఎమ్మెల్సీ ఇక్భాల్ కు ఏమంత ప్రజాభిమానం లేకపోయినా.. మంత్రే ఎస్టాబ్లిస్ చేస్తున్నారంటూనిలదీసినంత పనిచేయడంతోసభ నుంచి పెద్దిరెడ్డి నిష్క్రిమించాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు పెనుగొండలోనూ అదే రిపీట్ అయ్యింది. ఏకంగా చెప్పు చూపించే సరికి పెద్దిరెడ్డికి మైండ్ బ్లాక్ అయ్యింది. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తానని బీరాలు పలికిన పెద్దిరెడ్డికి సొంత పార్టీ శ్రేణులే సత్కారాలు చేస్తున్నారని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.