Homeఅంతర్జాతీయంAP Police: చట్టం..ఏపీలో ఇది చుట్టం

AP Police: చట్టం..ఏపీలో ఇది చుట్టం

AP Police: ఏపీలో శాంతిభద్రతలు దారుణంగా మారాయి. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు వైసీపీ సర్కార్ యంత్రాంగాన్ని వాడుకుంటోంది. అధికార పక్షం చేసిందే న్యాయం.. ఆడిందే ఆట అన్నట్టు పరిస్థితి మారిపోయింది. పవన్ కళ్యాణ్ లాంటి విపక్ష నేత చేపడుతున్న వారాహి యాత్రలో విధ్వంసాల కోసం అల్లరి మూకలను రంగంలో దించే పరిస్థితి వచ్చిందంటే.. ఏపీలో శాంతి భద్రతలు ఏ స్థాయికి దిగజారాయో అర్థమవుతోంది. విపక్షాలు ప్రజా సమస్యలపై ప్రశ్నించకూడదు. అధికార పక్షం పై విమర్శలు చేయకూడదు. ప్రజాస్వామ్య యుతంగా చేస్తున్న పోరాటాలను సైతం అణచివేయడం దారుణం.

సాధారణంగా విపక్షాలు నిరసన తెలిపినప్పుడు, ప్రజా జీవనాన్ని ఆటంకం కలిగించినప్పుడు పోలీసులు కేసులు నమోదు చేయడం ఆనవాయితీ. చిన్నపాటి సెక్షన్లు విధించి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరిమీదైనా టార్గెట్ చేశారంటే హత్యాయత్నం కేసులు పెడుతున్నారు. అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారు. తలుపులు బద్దలు కొట్టి మరీ ఇళ్లలోకి ప్రవేశిస్తున్నారు. అంతటితో ఆగడం లేదు. న్యాయస్థానాలకు సైతం తప్పుడు సమాచారం అందిస్తున్నారు.

పోలీసులు కేసుల నమోదు ప్రక్రియను సైతం నిబంధనల మేరకు జరపడం లేదు. అప్పుడెప్పుడో ఆగస్టు 30న మాచర్ల నియోజకవర్గంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దానిని బాధ్యులు చేస్తూ టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి బ్రహ్మ రెడ్డి పై ఇప్పుడు హత్యాయత్నం కేసు పెట్టారు. అప్పట్లో అదుపులో తీసుకున్న ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. ఇది ముమ్మాటికీ రాజకీయ కుట్ర అని పోలీసులకు సైతం తెలుసు. కానీ కొందరు అధికారుల ఒత్తిడి పుణ్యమా అని శాంతిభద్రతల విషయం పక్కన పెట్టి మరి రాజకీయ ప్రత్యర్థులపై కేసులతో ఉక్కు పాదం మోపుతున్నారు.

మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు అరెస్టు చేశారు. మహిళా కమిషన్ ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు చర్యలకు దిగడం సరైన చర్యే. కానీ ఈ అరెస్టు విషయంలో న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇవ్వడం మాత్రం విచారకరం. నోటీసులు ఇచ్చామని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అందుకే అరెస్టు చేసినట్లు చెప్పుకొచ్చారు. మరోసారి బండారు సత్యనారాయణమూర్తి అసలు నోటీసులే తీసుకోలేదన్నారు. నోటీసులు పై ఉన్న సంతకం ఆయనది కాదని సైతం చెప్పుకొచ్చారు. దీంతో పోలీసుల తీరుపై ఏకంగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ తాము తప్పు చేశామని పోలీసులు ఎటువంటి పశ్చాత్తాపం కనిపించడం లేదు. ఈ కేసునకు సంబంధించి ఎవరిది తప్పు అని చెప్పడం కంటే.. బండారు సత్యనారాయణమూర్తి అరెస్టు విషయంలో మాత్రం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించినట్లు వెల్లడైంది.

అసలు రోడ్డుపైకి రావడానికి విపక్ష నేతలు భయపడుతున్న పరిస్థితిని వైసిపి సర్కార్ కల్పించింది. చివరకు ప్రజా సంఘాల నాయకులు సైతం పోరాటానికి వెనుకడుగు వేయాల్సిన దౌర్భాగ్యస్థితి నెలకొంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో ప్రజా సంఘాలు ముందుంటాయి. వామపక్షాల అనుబంధ సంఘాలు కర్షక,కార్మిక వర్గాలతో పాటు అన్ని రంగాల సమస్యలపై పోరాటం చేస్తాయి. అటువంటి వారిపై సైతం నిర్బంధాలు కొనసాగుతున్నాయి. తాజాగా వారాహి యాత్రను చేపడుతున్నారు పవన్ కళ్యాణ్. తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించారు కూడా. ఇటువంటి తరుణంలో యాత్రలో టిడిపి, జనసేన శ్రేణులు పాల్గొంటున్నాయి. అయితే రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు, విధ్వంసాలు సృష్టించేందుకు ఏకంగా ప్రభుత్వమే ప్రయత్నిస్తుండడం విచారకరం. వైసిపి సర్కార్ దమనకాండకు పోలీసులను పావుగా వాడుతుండడం విచారకరం. ఒక్క మాటలో చెప్పాలంటే చట్టం.. ఏపీలో అధికార పక్షానికి చుట్టంగా మారింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular